మెట్రోతో ట్రాఫిక్ కష్టాలు తీరతాయా…?

హైదరాబాద్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెట్రో రైలు ప్రారంభం కాబోతోంది. రెడ్డెక్కాలంటేనే భయపడుతున్న నగర జీవి మెట్రో రైలుపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ట్రాఫిక్ జాంలతో నిత్యం నరకం అనుభవిస్తున్న సగటు హైదరాబాద్ పౌరుడు రానున్న రోజుల్లో కష్టాలు తీరతాయని గంపెడు ఆశతో ఉన్నాడు. ప్రస్తుతానికి నాగోల్ నుండి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల దూరం మెట్రో రైలు నడవనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్ని పూర్తి కాగా ప్రధాని నరేంద్ర మోడీ రైలుకు పచ్చ జెండా ఊపిన వెంటనే రైలు పరుగులు ప్రారంభం అవుతాయి. ఈ రూట్ తో పాటుగా ప్రధానమైన ఎల్బీనగర్ రూచ్ లో కూడా మెట్రో సేవలు ప్రారంభం అయితేగానీ నగరజీవి కష్టాలు కొంతమేరకైన తగ్గవు.
గంటల తరబడి ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలు మెట్రోపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. చిన్న చినుక్కే నిల్చిపోయే ట్రాఫిక్, రోడ్లపై నీళ్లు నిల్చిపోవడంతో నిత్యం నరకం చూస్తున్న నగరవాసి కష్టాలు ఇప్పుడు తీరనున్నాయి. మెట్రో పూర్తిస్థాయిలో నడిచినప్పుడే నగరవాసి కష్టాలు గట్టెక్కనున్నాయి. ప్రపంచ మెట్రో రైళ్లలోనే మేటిగా నిలుస్తూ హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకుని వస్తున్న మెట్రో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించే సమయం కోసం నగర ప్రజలు వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. ప్రపంచంలోని అనేక నగరాల ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టిన మెట్రో రైలు హైదరాబాద్ నగర జీవిని కూడా ట్రాఫిక్ కష్టాల నుండి గట్టెక్కిస్తుందని ఆశిద్దాం.