మేరా భారత్ మహాన్…

By: Anita Yelishetty
బస్ కోసం స్టాప్ లో నిల్చోని ఎదురుచూస్తూంటే… ఇద్దరు యువకుల మధ్య గొడవ… చెరో నాలుగు మాటలు అనుకోగానే అందులో ఒకడికి పట్టలేని ఆవేశం వచ్చింది.అంతే… నీ అమ్మ…అక్క, చెల్లి, భార్య ఇలా ఇంట్లో ఉన్న ఆడవాళ్లనందర్నీ ఆ గొడవలోకి లాగి వాళ్లనేదో చేసేస్తామని ఊగిపోవడం, దానికి అవతలివాడు మరింత రెచ్చిపోయి నీ ఇంట్లో ఆడవాళ్లను నేను కాదు జంతువులే ఆ పని చేస్తాయని చెప్పడం, ఆ పక్కనే అడుక్కుంటున్న ఓ ఏడు సంవత్సరాల పిల్లోడు ఇదంతా విని ఏదో గొప్ప విజ్ఞానం పొందినట్టు ఫీలవడం,మర్నాడు అవే మాటలు చాలా సరదాగా వాడూ మాట్లాడడం నేను గమనించాను. ఆ తర్వాత వాడికది నిత్యకృత్యం అయ్యింది, పక్కనే ఉన్న వాడి చిన్ని చెల్లి ఆ మాటలు విని భయంగా చూడడం నాకూ భయాన్ని కలిగించింది.
అక్కడ జరిగిన గొడవ అబ్బాయిలో అహాన్ని నింపగా, అమ్మాయిలో న్యూనతను పెంచింది. అబ్బాయిలో మృగత్వానికి బీజాలు పడితే, అమ్మాయిలో అసహాయత, ఆధారపడే మనస్తత్వం అలవాటు చేసింది.
ఇలా ఇంట్లో ఆడవాళ్లని అపురూపంగా చూసుకోవడం చేతకాని ప్రతి మగాడు సభ్యసమాజాన్ని తప్పుదోవ పట్టించడం కేవలం మన దేశంలోనే సాధ్యం… అందుకే జోర్ సే బోలో మేరా భారత్ మహాన్!
ఒకే ఇంట్లో పుట్టిన తోబుట్టువుల్లో అమ్మాయిని ఒక లాగ, అబ్బాయిని ఒకలాగ చూడడం, అబ్బాయికి ‘బారా ఖూన్ మాఫ్’ అనే స్వాతంత్రం ఇవ్వడం కూడా కేవలం మన దేశంలోనే సాధ్యం… అందుకే జోర్ సే బోలో మేరా భారత్ మహాన్!
బలవంతుడిదే రాజ్యం అనే సిద్ధాంతానికి గొర్రెల్ల తలూపి ఆజ్యం పోయడం కూడా కేవలం మన దేశంలోనే సాధ్యం… అందుకే జోర్ సే బోలో మేరా భారత్ మహాన్!
అవతలివాడి మీద కసి తీర్చుకోవాలంటే వాడి ఇంట్లోని మహిళను బయటకు లాగడం కూడా కేవలం మన దేశంలోనే సాధ్యం… అందుకే జోర్ సే బోలో మేరా భారత్ మహాన్!
పాట్యాంశంగా పాఠశాలల్లో బోధించాల్సిన సెక్స్ ఎడ్యుకేషన్ ఇతర మాధ్యమాల ద్వారా శృంగారం కింద నేర్పడం కూడా కేవలం మన దేశంలోనే సాధ్యం… అందుకే జోర్ సే బోలో మేరా భారత్ మహాన్!
న్యాయం కాపాడాల్సిన న్యాయవాదులే అన్యాయానికి కొమ్ముకాస్తూ న్యాయం చేయండని ర్యాలీలు చేయడం కూడా కేవలం మన దేశంలోనే సాధ్యం… అందుకే జోర్ సే బోలో మేరా భారత్ మహాన్!
మనశ్శాంతికి మతపరమైన సంప్రదాయాలు పాటించాల్సింది పోయి, అశాంతిని ప్రేరేపించేవిగా చేయడం కూడా కేవలం మన దేశంలోనే సాధ్యం… అందుకే జోర్ సే బోలో మేరా భారత్ మహాన్!
నీ రాచరిక పాలనలో అఘాయిత్యాలు జరిగితే అది జంగల్ రాజ్, నా అద్భుతమైన పాలనలో జరిగితే ప్రత్యర్థి రాజకీయప్రయోజనం కోసమే ఈ ఆరోపణలు అనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా మనదే అందుకే జోర్ సే బోలో మేరా భారత్ మహాన్!
మనుషుల్లోని మృగత్వానికి రాతి బొమ్మలను, కట్టడాలను, ప్రార్థనా స్థలాలను నిందించడం కూడా కేవలం మన దేశంలోనే సాధ్యం అందుకే జోర్ సే బోలో మేరా భారత్ మహాన్!
ఇది పుణ్యభూమి, కర్మభూమి, భారత్ మాతా కి జై…ఆడబిడ్డలకు స్థానం మాత్రం నై నై…
women