మేడారం జాతరకు ఇంకా పదిరోజులు ఉండగానే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వనదేవతలను దర్శంచుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీనితో మేడారం పరిసర ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. వేలాది వాహనాలు బారులు తీరడంతో పస్ర-మేడారం మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయాయి. మేడారం జాతర ప్రారంభం కావడానికి ఇంకా పదిరోజుల వ్యవధి ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం గద్దెవద్దకు చేరుకుంటున్నారు. ఒక్క ఆదివారమే మూడులక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.
జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన తరువాత భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్తున్నారు. కళ్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించుకుంటున్నారు. మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో బక్తులు తరలివస్తారు. భారతదేశంలో కుంభమేళా తరువాత ఎక్కువ మంది హజరయ్యేది మేడారం జాతరకే. తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్రా,చత్తీస్ ఘడ్, కర్ణాటక ల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు మేడారంకు తరలివస్తారు.