మన కన్నా ఆఫ్రికా దేశాలే నయం…

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రదేశాలతో పోటీ పడుతున్న భారత్ కొన్ని విషయాల్లో అత్యంత వెనుకబడ్డ ఆఫ్రీకా దేశాలతోనూ సరిసమానంగా నిలుస్తోంది. మలేరియా విషయంలో భారత్ అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. ప్రపంచంలో మలేరియా మరణాల్లో భారత్ నాలుగో స్థానంలో నిల్చింది. అత్యంత వెనుకబడిన సబ్ సహారా దేశాల సరసన భారత్ నిల్చింది. మలేరియాను నిలువరించడంలో భారత్ ఘోరంగా విఫలం అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నైజీరియా, కాంగో, బుర్కినా ఫోసో లాంటి ఆఫ్రికా దేశాలే మనకన్నా వెనక నిలవగా మిగతా అన్ని దేశాలను దాటుకుని భారత్ నాలుగో స్థానంలో నిల్చి మలేరియా నివారణలో భారీ అపప్రదను మూటకట్టుకుంది.
పొరుగున శ్రీలంక మలేరియా రహిత దేశంగా పేరు పొందగా భారత్ లో ఈ రోగ లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. మలేరియా కారణంగా మరణిస్తున్న వారి వివరాలు సైతం అధికారికంగా నమోదు కావడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. రానున్న రోజుల్లో మలేరియాను దేశం నుండి తరిమేస్తామని కేంద్రం చెప్తున్న మాటలకు చేతలకు పొంత కుదరడం లేదు. స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నప్పటికీ వాటి ఫలితాలు మాత్రం కనిపించడం లేదు.