అనవసరంగా బయటికి వస్తే ఇక జైలుకే

లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న సంగతిని గమనించిన కేంధ్రప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. వివిధ రాష్ట్రాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు పట్టించుకోవడం లేదనే సమాచారంతో కేంద్రం అప్రమత్తం అయింది. రకరకాల కారణాలు చేప్తున్న ప్రజలు రోడ్లపైకి వస్తున్న సంగతి తెలిసిందే. నిత్యావసర వస్తువుపేరు చెప్పి వస్తున్న వారు కొందరైతే మరికొందరు లాక్ డౌన్ సమయంలో రోడ్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి వస్తున్నామని చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతవుతోంది.
ఇటువంటి పరిస్థుల నేపధ్యంలో కేంద్రం తీవ్ర చర్యలకు సమాయత్తం అవుతోంది. అనవసరంగా రోడ్లమీదకు వచ్చే వాళ్లను జైళ్లకు తరలించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అంటువ్యాధుల నివారణ చట్టం లాంటి కఠినమైన చట్టాలను ఉపయోగించి అనవసరంగా రోడ్డుమీదకు వచ్చే వాళ్లని జైలుకు పంపేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ చట్టం ప్రకారం ఎటువంటి సరైన కారణం లేకుండా రోడ్డు మీదకు వచ్చే వారికి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు లాక్ డౌన్ ను ధిక్కరించి రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ జైలు శిక్షలు పడే అవకాశం ఉన్న సెక్షన్ల క్రింత కేసులు నమోదు కావడం లేదు. వాహనాలకు సీజ్ చేయడంతో పాటుగా జరిమానా విధిస్తున్నారు.
అయితే పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తీవ్రమైన శిక్షలు వేసేందుకు ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వాధినేతలు స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నా పరిస్థితుల్లో మార్పులు కనిపించకపోవడంతో ప్రభుత్వం ఇక కఠిన చర్యలకు పూనుకుంటోంది.