కర్ణాటకలో కొలువుదీరిన జీడీఎస్-కాంగ్రెస్ సర్కారు

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. జేడీఎస్- కాంగ్రెస్ ల సంకీర్ణ కూటమి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ‌విధాన సౌధ తూర్పుద్వారం మెట్ల వద్ద ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఆయనతో గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు, ప్రజలు హాజరయ్యారు. ప్రస్తుతానికి వీరిద్దరీ ప్రమాణ స్వీకారం చేయగా ప్రభుత్వం బల నిరూపరణ అయిన తరువాత పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నార. జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు.. జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. స్పీకర్‌ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించగా.. డిప్యూటీ స్పీకర్‌ పదవిని జేడీఎస్‌కు ఇచ్చారు.
జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌, పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వి యాదవ్‌, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి తదితరులు హాజరయ్యారు.