మెట్రో పరుగులు-స్కై వేలతో విశ్వనగరంగా హైద్రాబాద్

హైదరాబాద్ లో మౌౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బాలానగర్ లో 400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటీఆర్ శంఖస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందని దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 3వేల కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపడుతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. ఉప్పల్ నుండి ఘట్ కేసర్ వరకు ఫ్లై ఓవర్ ల నిర్మాణంతో పాటుగా అంబర్ పేట్ ఛే నంబర్ నుండి రామంతపూర్ వరకు మరో ఫ్లై ఓవర్ ను నిర్మిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండు భారీ స్కై వేలను నిర్మించబోతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. వాటి నిర్మాణానికి కావాల్సిన అనుమతులు అన్ని వచ్చాయని త్వరలోనే వాటి నిర్మాణం ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంలో తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉందని కేటీఆర్ వెల్లడించారు.
గత పాలకుల తప్పిదాల వల్ల నగరంలో అనేక సమస్యలు వెన్నాడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని గత పాలకులకు ముందుచూపు లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. నగరంలో రెండు సెంటీమీటర్ల వర్షం పడితే నగరం అతలాకుతలం అవుతోందని దీని కోసం గాను ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థను మార్చడానికి దాదాపు 11వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. దానితో పాటుగా నగరం మొత్తం తవ్వాల్సి వస్తుందని వాటికి ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నట్టు కేటీఆర్ వివరించారు.
నవంబర్ నాటికల్లా మెట్రో రైలు పరుగులు మొదలు పెడుతుందని కేటీఆర్ వెల్లడించారు. నాంపల్లి నుండి మియాపూర్ వరకు మెట్రో రైలును ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేటీఆర్ తెలిపారు. దాని తర్వాత అతి త్వరలోనే మిగతా రూట్లలో కూడా మెట్రో రైలు నడపడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. మెట్రో రైలు రెండో దశ పనులను కూడా ప్రారంభించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ ను అన్ని విధాలుగా బ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ఇప్పుడు రోడ్లపై, మౌళిక సౌకర్యాలపై విమర్శలు చేయడం దారుణమని కేటీఆర్ అన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదని ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కి కూడా తెలుసని అయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని కేటీఅర్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *