ఉ.కొరియాను సర్వనాశనం చేస్తాం-అమెరికా తీవ్ర హెచ్చరిక

0
88

ఉత్తర కొరియాతో యుద్ధమంటూ వస్తే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని అగ్రరాజ్యం అమెరికా గట్టిగా హెచ్చరించింది. తాజాగా ఉత్తర కొరియా మరో ఖండాతర క్షిపణి పరీక్షించిన నేపధ్యంలో అమెరికా ఈ ఘాటు హెచ్చరికలు చేసింది. ఉత్తర కొరియా దూకుడు పై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ మాట్లాడారు. తాము ఇప్పటికీ యుద్ధానికి కోరుకోవడం లేదని అయితే ఉత్తర కొరియా మాత్రం తమ సహనాన్ని పరీక్షిస్తోందన్నారు. అమెరికా మీద దాడికి తెగబడితే ఊరుకునేది లేదని ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామంటూ తీవ్రంగా హెచ్చరికలు చేశారు. ఈ స్థాయిలో ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా గతంలో ఎన్నడూ హెచ్చరికలు చేయలేదు. తాము శాంతి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉత్తర కొరియా మాత్రం యుద్ధాన్నే కోరుకుంటున్నట్టు కనిపిస్తోందన్నారు.
కొద్ది విరామం తరువాత మరోసారి క్షిపణి పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా తమ పరీక్షలు విజయవంతం అయ్యాయని దీనితో అమెరికా మొత్తం తమ క్షిపణి పరిధిలోకి వచ్చిందని ప్రకటించింది. తమ దేశాన్ని అమెరికాతో సమానంగా పూర్తి అణ్వాయుధ దేశంగా గుర్తించాలంటూ ఆ దేశం డిమాండ్ చేస్తోంది. కొరియా క్షిపణి పరీక్షల నేపధ్యంలో మరోసారి కొరియా ద్వీపకల్పంలో ఉధ్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. జపాన్, దక్షిణ కొరియా ఈ పరీక్షలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. జపాన్ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. మరో వైపు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను జరిగిపిన కొద్ది సేపటికే దక్షిణ కొరియా కూడా క్షిపణి పరీక్షను విజయవంతంగా ప్రయోగించింది. తమ భద్రతా చర్యల్లో భాగంగానే క్షిపణి పరీక్షలు జరిపినట్టు దక్షిణ కొరియా వెల్లడించింది.
ఉత్తర కొరియాతో అన్ని దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను వదులుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. వారిపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని కోరుతోంది. అటు రష్యా కూడా ఉ.కొరియా చర్యలను ఖండించింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here