టీఆర్ఎస్ లో హరీష్ రావుకూ ఇబ్బందులు: కొండా సురేఖ

0
78
కొండా సురేఖ

టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్రంగా విరుచుకుని పడ్డారు కొండా సురేఖ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు లేదో తనకు రెండురోజుల్లోగా సమాధానం చెప్పాలని చేసిన డిమాండ్ ను గుర్తు చేస్తూ పదిరోజులు గడిచినా పార్టీ నుండి ఎటువంటి స్పందనా రాకపోవడంతో తాను కేసీఆర్ కు భహిరంగ లేఖను రాస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసగించాడని, పార్లమెంటు ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓడిపోతాననే భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది కేసీఆర్ వ్యూహామని కొడుకు పాలనా పగ్గాలు అప్పగించేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలను వెళ్తున్నాడని అన్నారు.
పార్టీలో చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయని కేవలం కేటీఆర్ కోటరీకే ప్రాధన్యం లభిస్తోందని, హరీష్ రావు కూడా పార్టీలో చాలా ఇబ్బందులు పడుతున్నాడని ఆమె పేర్కొన్నారు. హరీశ్ రావును పక్కనపెట్టారని ఆయనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదన్నారు. రాజకీయాలను విరమించుకోవాలనుకుంటున్నట్టు హరీశ్ రావు ప్రకటించడం కూడా ఇందుకేనని కొండా సురేఖ చెప్పారు. ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడంలేదన్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదని దీన్ని బట్టి వాళ్లు మహిళలకు ఇచ్చే గౌరవం ఏపాటిదో తెలుస్తోందన్నారు. ఒక బీసీ మహిళగా పార్టీలో తనకు తీవ్ర అవమానాలు జరగాయని అయినా వాటిని తట్టుకుని పార్టీ కోసం పనిచేశానని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల వల్ల సామాన్యులు ఒరిగింది ఏమీలేదని, ఉద్యోగాలు వస్తాయని ఎన్నోఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలుగానే మిగిలాయన్నారు. ఇటు కేసీఆర్ కుటుంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలు వచ్చాయని సమయానికి మందులు ఇచ్చేందుకు పెట్టుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటును కట్టబెట్టిన ఘన కేసీఆర్ కే దక్కిందని కొండా సురేఖ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఒక్క రోజుకూడా సచివాలయానికి రాని వ్యక్తిగా కేసీఆర్ చరిత్ర సృష్టించాడని ఆమె ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఇచ్చిన దేవత అంటూ సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు ఆమెను దయ్యం అంటూ అవహేళన చేయడం దారుణమన్నారు. టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర రావు తండ్రి చనిపోతే వరంగల్ కు వచ్చి పరామర్శించిన కేసీఆర్ తన తండ్రి చనిపోతే కనీసం పలకరించిన పాపానపోలేదన్నారు. తమ కుటుంబానికి కేసీఆర్ నమ్మకద్రోహం చేశారన్న కొండా సురేఖ వాటిని వివరించేందుకే మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. మరో నాలుగు రోజుల్లో తమ భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తానని సురేఖ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీఅర్ఎస్ ఓడిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ వైఖరి, దొరల పాలన వల్ల ప్రజలు విసిగిపోయారని ఆమె పేర్కొన్నారు. మహా కూటమి చేతిలో కేసీఆర్ కు పరాభవం తప్పదని చెప్పడం ద్వారా కొండా సురేఖ భవిష్యత్ కార్యాచరణను చెప్పకనే చెప్పారు.

Wanna Share it with loved ones?