పతంగ్..డీల్…పేంచ్..కాట్..- మధుర జ్ఞాపకాలు

( రెండు దశాబ్దాల కిందటి మధుర జ్ఞాపకాలు: ఓ మిత్ర బృందం)

సంక్రాంతి వస్తోందంటే సంబురమే… సంక్రాంతికి వారం ముందు నుండే పతంగుల హడావుడి మొదలయ్యేది. సాయంత్రం నుండి స్కూల్ నుండి రాగానే  పతంగులు తీసుకుని మిద్దమీదికి ఎక్కితే ఇక కిందకి దిగేది రాత్రికే… రకారకాల పంతంగులతో ఆకాశం మొత్తం రంగవల్లులు తీర్చిదిద్దునట్టుగా కనిపించేవి. ఎదుటి వారి పతంగ్ ను కాట్ చేస్తే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం. పతంగులకు కన్నాలు కట్టడం దగ్గర నుండి పతంగులు ఎగరేయడం పేంచ్ లు వేయడం ఇదేమీ చిన్నా చితక కళ కాదు. ఇందులో ఆరితేరిన నిపుణులున్నారు. మంచి మాంజాలకోసం వెతుకులాటలు, దాని కోసం కిలోమీటర్ల కొద్ది సైకిళ్లపై ప్రయాణం అదో మధురానుభూతులు. పక్కనోడు యకత్ పురా సత్తార్ భాయ్ మాంజా తీసుకుని వస్తే మనం ధూల్ పేట్ గులాబ్ సింగ్ మాంజా తేవాల్సిందే. పౌండ్, అద్ద పౌండ్ , డోరీదార్, కడీకంప్ అంటూ రకాల పతంగులను ఎగురవేస్తుంటే ఆ మజానే వేరు. ఇక పండుగ మూడు రోజులు పూర్తిగా మేడల మీదే గడిచిపోయేది. తిండి తిప్పలు అన్నీ అక్కడే. లౌడ్ స్వీకర్ ను అద్దెకు తెచ్చుకుని లైవ్ కాంమెంట్రీతో, హోరెత్తించే పాటలతో పతంగులను ఎగరవేయడం పక్కనోళ్ల పతంగులను కాట్ చేయడం మూడు పెంచ్ లు ఆరు కాట్ లతో కాలం గడిచిపోయేది.
కాలం మారింది పతంగ్ ల హవా తగ్గింది. గతంలో లాగా ఇంటి మిద్దెలు లేవు అపార్ట్ మెంట్లు వెలిశాయి. పెంట్ హైస్ లు వాటర్ ట్యాంకులు ఇతరత్రా అవసరాలు పతంగులు ఎగరేసే చోటెక్కడ. అసలు ఇప్పటి పిల్లల్లో పతంగులు ఎగరేయాలనే కోరిక కూడా కనిపించడం లేదు. పేపర్ పంతంగులు పోయి కవర్ పతంగులు వచ్చాయి. స్థానిక మాంజాల స్థానాన్ని చైనా మాంజాలు ఆక్రమించాయి. ఆ నైనాన్ మాంజాలతో మజా ఎక్కడిది. ఇప్పటి పిల్లల్లో చాలా మందికి పతంగులు ఎగరవేయడమే రావడం లేదు. అదో బ్రహ్మ విద్యలాగా కనిపిస్తోంది. కంప్యూటర్ గేమ్స్, వాట్సాప్ వీడియోలు చూడ్డం తప్ప పతంగుల మజాను ఆస్వాదించలేకపోతున్నారు. కాలంతో పాటుగా పండుగలు వాటి ప్రాధాన్యతలు కూడా మారిపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *