తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లీస్ పార్టీకి పూర్తిగా దాసోహం అంటున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. నిజాంను కేసీఆర్ పొగిడితే కేసీఆర్ ను మజ్లీస్ పార్టీ పొగుడుతోందని అన్నారు. నిజాం కు అన్యాయం జరిగినట్టుగా కేసీఆర్ సభలో చేసిన ప్రసంగాన్ని కిషన్ రెడ్డి తప్పుపట్టారు. వందలాది మంది ప్రాణాలను బలిగొన్న నిజాం ను పొగడడం అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో అశువులు బాసిన వారిని అవమానించడమేనని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
నాటి నిజాం నవాబు ఏలిన ప్రాంతం భారత్ విలీనం కావడమే తప్పు అన్నట్టుగా కేసీఆర్ ప్రసంగం సాగిందని కిషన్ రెడ్డి అన్నారు. మజ్లీస్ పార్టీకి కేసీఆర్ పూర్తిగా సాగిల పడిపోయారి కిషన్ రెడ్డి అన్నారు. నిజాం భారత్ సర్కారుకు భారీ మొత్తంలో బంగారం ఇచ్చినట్టుగా కేసీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవాలు బయటపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ చరిత్రకు కొత్త భాస్యం చెప్తున్నారని అన్నారు.