తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కీసీఆర్ జీవిత కథ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఉధ్యమకారుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయాలను ఆధారంగా చేసుకుని ఒక చిత్రాన్ని నిర్మించనున్నాట్టు నిర్మాత మధర శ్రీధర్ ప్రకటించగా ఈ చిత్రంలో కేసీఆర్ గా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ జీవితంలోని అనేక మైలు రాళ్లను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో కేసీఆర్ గా బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు నటిస్తారనే ప్రచారం జరగ్గా తాజాగా మరో పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ కే చెందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ కేసీఆర్ బయోపిక్ లో కేసీఆర్ గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి చెందిన యూనిట్ మాత్రం దీనిపై ఎటువంటి స్పష్టతా ఇవ్వడం లేదు. సిద్ధిఖీ మాత్రం తాను దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు అభ్యంతరం లేదని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ బయోపిక్ పై మాత్రం అతను పెదవి విప్పడం లేదు. సిద్ధిఖీ కి కేసీఆర్ కు కొద్దిగా పోలీకలు ఉండడం కూడా ఆయన వైపే నిర్మాతలు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ బయోపిక్ ఇటి రాజకీయ వర్గాల్లోనూ, అటు సినీ వర్గాల్లోనూ ఆశక్తిని కలిగిస్తోంది.