ఏపీ 'హోదా'ను గురించి పట్టించుకోని కర్ణాటక తెలుగు ఓటర్లు

కర్ణాటక ఎన్నికల ఫలితం తెలిపోయింది. అధికారం కాంగ్రెస్ ను కాదని ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి జై కొట్టారు. అవినీతి ఆరోపణలు, అధికార పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత, మోడీ ఛరిష్మా కారణాలు ఏదైనా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తోంది. మెజార్టీకి అవసరమైన 113 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కన్నడ రాష్ట్రంలో హంగ్ వస్తుందంటూ సాగిన ఊహాగానాలకు తెరదించుతూ బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎవరి సహాయం లేకుండానే అధికారాన్ని చేజిక్కించుకుంది.
కర్ణాటక ఫలితాలపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆశక్తిని ప్రదర్శించడం ఒక ఎత్తయితే తెలుగు రాష్ట్రాల్లో వీటి ఫలితాలను పై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఏపీ ప్రజలు కన్నడ ఫలితాలు ఎట్లా వస్తాయోనని ఎదురుచూస్తూ ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటలోని తెలుగు వారికి బీజేపీకీ ఓటువేయవద్దని పిలుపునివ్వడమే ఇందుకు ప్రధాన కారణం. తాను స్వయంగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా చంద్రబాబు కర్ణాటకలోని తెలుగు ప్రజలకు బీజేపీకి బుద్ది చెప్పాల్సిందిగా పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీతో పాటుగా ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు స్వయంగా కర్ణాటలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ప్రచారాలు ఏవీ పెద్దగా ఫలించినట్టు కనిపించడం లేదు. కర్ణాటలోని దాదాపు 60 స్థానాల్లో తెలుగు ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. గెలుపు ఓటములను ప్రభావం చేయగలిగే స్థాయిలో ఉన్న తెలుగు ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. ఈ నేపధ్యంలో తెలుగు ప్రజల తీర్పుపై అటు కర్ణాటకలోనూ ఇటీ ఏపీ లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే కర్ణాటకలోని తెలుగు ప్రజలు ఈ ప్రచారాలను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తెలుగు వాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనూ బీజేపీకి అధిక సంఖ్యలో సీట్లు వచ్చాయి. బీజేపీని వ్యతిరేకించడం వరకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే పనిగట్టుకుని చంద్రబాబు నాయుడు కర్ణాటలో తమ పార్టీని ఓడించేందుకు ప్రయత్నించడం మాత్రం దారుణమని దీన్ని తమ పార్టీ అంత తేలిగ్గా వదిలిపెట్టదని బీజేపీ ముఖ్యనాయకుడు ఒకరు చెప్పడం విశేషం.
తమకు వ్యతిరేకంగా కర్ణాటకలో ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు తన పరువే పోగొట్టుకున్నడని సదరు నేత వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాల తరువాత ఏపీలో రాజకీయ పరిణాలు ఎట్లా మారతాయో వేచిచూడాల్సిందే…