ఆర్టికల్ 370రద్దుతో కాశ్మీర్ కు పూర్వ వైభవం వస్తుందా…?

భారతదేశ చరిత్రలోనే మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్క్రుతమైంది. జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలమైన నిర్ణయం తీసుకుంది. దీనితో దేశంలోని ఇత ప్రాంతాలతో సమానంగా జమ్ము కాశ్మీర్ ఉండబోతోంది. ఇప్పటివరకు ఉన్న ప్రత్యేక వెసులు బాట్లు ఏవీ ఉండడంలేదు. మరో వైపు జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని విడదీయడంతో పాటుగా ఈ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల జమ్ము కాశ్మీర్ లో అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగానూ, మరో భాగం లడాక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగానూ మిగలబోతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అత్యంత కీలక నిర్ణయం తరువాత జమ్ము కాశ్మీర్ లో ముఖ్యంగా కాశ్మీర్ లోయలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయనేది ఇప్పుడు ఆశక్తిగా మారింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయా… కాశ్మీర్ లో పెట్టుబడులు పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఇక్కడి ప్రజల జీవన స్థితిగతుల్లో సమూల మార్పులు వస్తాయా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
1989 నుండి లోయలో వెళ్లూనుకున్న తీవ్రవాదానికి ఆర్టికల్ 370 రద్దు తో ముగింపు పలుకుతుందనే ఆశ కేంద్ర ప్రభుత్వంతో పాటుగా అత్యధికశాతం మంది ప్రజలు భావిస్తున్నారు.
• పార్లమెంటు ఆమోదం, రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల ఆర్టికల్ 370 రద్దయింది అంటే కాశ్మీర్ లో భారత రాజ్యంగం అమలవుతున్నట్టే కదా అనేది కొందిరి వాదన.
• ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ఆ ప్రాంతానికి ఒనగూరే అదనపు ప్రయోజనాలు ఏమీ లేదనేదని కాంగ్రెస్, కమ్యూనిస్టులు అంటున్నారు.
• ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ కూడా భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం అయిపోయిందని రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు రద్దు కావడం శుభపరిణామమని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.
• ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్ లోయలో పరిస్థితులు మరింత సంక్షిష్టంగా మారే అవకాశాలున్నట్టు నిపుణలు అంచానా వేస్తున్నారు.
• కాశ్మీరీ ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశాలున్నాయని దీని వల్ల ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్టు కొంతమంది భావిస్తున్నారు.
• ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన కేంద్ర పాలిత ప్రాంతంలో జమ్ము కాశ్మీర్ మారడం లాంటి పరిణామాలు ప్రపంచానికి అంతటికీ తెలిసినా కాశ్మీర్ ప్రజలకు మాత్రం దీని గురించి సమాచారం లేదు. ఇంటర్నెట్ లేకపోవడం, ఫోన్లు పనిచేయకపోవడం, కర్ఫ్యూ వల్ల బయటికి రాలేకపోవడమే ఇందుకు కారణం.
• ఆర్టికల్ 370 రద్దు ద్వారా భారత్ విలీన ఒప్పందాలకు తూట్లు పొడిచిందని పాకిస్థాన్ అంతర్జాతీయంగా భారత్ పై ఒత్తిడి తీసుకుని వచ్చే అవకాశం ఉంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుని అమెరికా మరోసారి మధ్యవర్తిత్వ అంశాన్ని తెలపైకి తీసుకుని రావచ్చు.
• వేర్పాటు వాదులు కాశ్మీరీ యువతను రెచ్చగొట్టేందుకు ఆర్టికల్ 370 రద్దు ఒక ఆయుధంగా మారే ప్రమాదాలు కనిపిస్తున్నాయి.
• సహజవనరులు అపారంగా ఉన్న కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు వల్ల దేశంలోని ఇతర ప్రాంతాలను నుండి పెద్ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగా దీనికి శాంతి భద్రతలు అదుపులోకి రావాల్సి ఉంది.
• దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా జమ్ముకాశ్మీర్ మారడం వల్ల దేశానికి అంతటికీ ఒకే చట్టం అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం భారీ భద్రత వలయ గుప్పిట్లో ఉన్న కాశ్మీర్ లో తిరిగి సాధారణ పరిస్థితులు రావాలని ఆశిద్దాం…
కాశ్మీర్ లో ఏం జరుగుతోంది… ఏం జరగబోతోంది…