అధికార లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెక్లెస్ రోడ్ లోని పీ.వీ. ఘాట్ కు సమీపంలో అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి నేతలతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉండడంతో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుబా గాంధీ భవన్ లో పార్టీ శ్రేణుల సందర్శనార్థం బౌతిక కాయాన్ని ఉంచుతారు. అక్కడి ఊరేగింపుగా నెక్లెస్ రోడ్ కు తీసుకురానున్నట్టు సమాచారం.

కేంద్ర మాజీ మంత్రి, సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన జైపాల్ రెడ్డి మరణం పట్ల పలువురు సంతాపం వెలిబుచ్చారు. విలువలకు కట్టుబడిన నేత అని, గొప్ప రాజకీయ వేత్త అంటూ వారు తమ సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీలు వేర్వేరు ప్రకటనల్లో జైపాల్ రెడ్డి మరణంపై సంతాపం వ్యక్తం చేయగా పలువురు నేతలు ఆయన నివాసానికి చేరుకుని పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, తెరాస నేతలు కె.కేశవరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కవిత తదితరులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రేణుకాచౌదరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మల్లు రవి, గీతారెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తెరాస నేతలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్‌, తీగల కృష్ణారెడ్డి, తెదేపా నేతలు కంభంపాటి రాంమోహన్‌రావు, దేవేందర్‌గౌడ్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెజస అధినేత కోదండరాం, భాజపా నేతలు కె.లక్ష్మణ్‌, బండారు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఎన్‌.రామచందర్‌రావు, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌, వామపక్ష నేతలు డి.రాజా, సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, బీసీ సంఘం ఛైర్మన్‌ రాములు, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, బీసీ సంఘం నాయకుడు ఆర్‌.కృష్ణయ్య, విద్యావేత్త చుక్కా రామయ్య తదితరులు నివాళులు అర్పించారు.