తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక?

తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీగా అవతరించే అవకాశాలున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సుత్రప్రాయంగా జేఏసీ ఛైర్మన్  కోదండరాం వెళ్లడించారు. జేఏసీ ఆవిర్భవ దినోత్సవాన్ని పుర్సకరించుకుని జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కోదండ రాం కొత్త పార్టీ ఆవిర్భావాన్ని గురించి సూత్రప్రాయం గా చెప్పారు. తెలంగాణ ఉధ్యమంలో కీలకలం గా వ్యవహరించిన కోదండరాం అప్పట్లో నాటి టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగారు. అటు తర్వాత వివిధ కారణాలతో వీరిద్దరూ అంటీ ముట్టనట్టుగానే ఉంటూ వచ్చారు. చాలా కాలం పాటు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శల జోలికి పోలేదు. అయితే క్రమంగా వచ్చిన మార్పులకు  అనుగుణంగా పరోక్ష విమర్శలతో మొదలై ప్రస్తుతం కోదండరాం పై టీఆర్ఎస్ శ్రేణులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.
కోదండరాం పై విమర్శలకు టీఆర్ఎస్ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. ప్రాజేక్టుల నిర్మాణాలకు సంబంధించి పేదల భూములు బలవంతంగా లాక్కుంటున్నారంటూ గ్రామాల్లో పర్యటిస్తున్న కోదండరాం ప్రభుత్వం పై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో భావసారూప్యత ఉన్న సంస్థలతో కలిసి ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న పలువురు వ్యక్తులు, సంస్థల సమూహారంగా కొత్త వేదిక ఏర్పాటు కానున్నట్టు సమాచారం.  ఉధ్యమ ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ సర్కారు పనిచేయడం లేదని కోదండరాం అంటున్నారు. ప్రభుత్వం తీసుకుని వచ్చిన పలు సంక్షేమ పథకాలు బాగానే ఉన్నప్పటికీ  ఆశించిన రీతిలో తెలంగాణ సర్కారు పనితీరు లేదని ఆయన పెదవి విరుస్తున్నారు. తెలంగాణ ఉధ్యమ సమయంలో చాలా మంది నేతలు, సంస్థలు ఉధ్యమం కోసం సర్వస్వం ధార పోసినా తీరా ఫలితాలు మాత్రం కొంత మంది వ్యక్తులు అనుభవిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొంత మంది నేతలు అందలం ఎక్కారని వీరు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉధ్యమాన్ని కించపర్చి, దాన్ని అణచడానికి ప్రయత్నించిన వ్యక్తులు సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మారారనేది వీరి ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో కొత్త రాజకీయ వేదికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కొత్త రాజకీయ వేదిక ఏర్పాటయిన అది ఏ మేరకు ఆశించిన ఫలితాలు సాధిస్తుందా అనేది వేచిచూడాల్సిందే. తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢికొనే శక్తి కొత్త వేదికకు ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ స్థాయి ఉన్న నేత కాని, ఆయన చరిష్మా ముందు నిలబడే శక్తి ఉన్న నేత కానీ మరొకరు లేరనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత కూడా పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేకత లేని ప్రస్తుత సమయంలో కొత్త రాజకీయ వేదిక ఎంతవరకు మనుగడ సాధించగలుగుతుంతో చూడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి ఉన్న తేడాను కూడా గమనించాల్సి ఉంది. భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉన్న ఆప్పటి పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి చాలా తేడా ఉంది. రాజకీయ వేదిక నడపడానికి కావాల్సిన అన్ని రకాల వనరులు సమకూరడం కూడా ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. ప్రస్తుతం పరిస్థితుల్లో తెలంగాణలో మరో రాజకీయ వేదిక ఎంతమేరకు సఫలీకృతం అవుతుంది అన్నది చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *