నిజంగా నేడు భారతీయులకు పండుగ రోజు అంటూ పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలపై అభినందనల జల్లు కురిపించారు. అంతరిక్షరంగంలో భారత్ పతాకాన్ని రెపరెపలాడించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సలాం అంటూ పలువురు అభినందనలు తెలిపారు. 104 ఉప గ్రహాలను ఒకేసారి కక్షలోకి విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి అభినందనలు తెలిపారు. అరుదైన రికార్డును సొంతం చేసుకున్న శాస్ర్తవేత్తలు మరింత ప్రగతిని సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఇస్రో బృందానికి సెల్యూట్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ప్రతీ భారతీయుడు గర్వ పడేలా ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని మోడీ తన అభినందనలు తెలుపుతూ దేశ ప్రజలంతా మన శాస్త్రవేత్తలను చూసి గర్వ పడుతున్నారని అన్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రక్షణ మంత్రి మనోహర్ పరికర్, విదేశంగా మంత్రి సుష్మస్వరాజ్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సహా పలువురు కేంద్ర మంత్రులు ఇస్రో బృందాన్ని అభినందించారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు కూడా వేర్వేరు ప్రకటనల్లో భారత అంతరిక్ష శాస్త్రవేత్తలను అభినందనలు తెలిపారు. ప్రముఖులతో పాటుగా దేశవ్యాప్తంగా ఈ ఘనత పై ఒకరికొకరు అభినందలు తెలుపుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో అభినందనల సందేశాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.