భారత్ -జపాన్ ల వ్యూహాత్మక మైత్రి బంధం

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామి దేశమైన జపాన్ తో మరింత దగ్గరవుతోంది. ప్రపంచంలో తిరుగులోని ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఉన్న జపాన్ ఇటీవల కాలంలో అంతర్జాతీయ అంశాల్లో కాస్త వేనకడుగు వేసిందనే చెప్పాలి. జపాన్ కు పోటీగా చైనా అన్ని రంగాల్లో దూసుకుని పోవడంతో పాటుగా జపాన్ అంతర్జాతీయ రాజకీయాల్లో తన పాత్రను పరిమితం చేసుకోవడం. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో కలివిడి తక్కువగా ఉండే నైజంతో కొంత వెనుకబడిపోయిన జపాన్ ఇప్పుడు పాత పోకడలకు స్వస్తి చెప్పి అంతర్జాతీయ రాజకీయాల్లో తిరిగి క్రియాశీలంగా మారుతోంది. ఒకప్పుడు ప్రపంచ అగ్రగామి సైనిక శక్తుల్లో ఒకటిగా ఉన్న జపాన్ రెండో ప్రపంచ యుద్ధం తరువాత సైనిక శక్తిని తగ్గించుకుంటూ వచ్చింది. సైనిక అవసరాలకు ఎక్కువగా అమెరికాపైనే ఆధారపడుతూ తన సైన్యాన్ని, సైనికి కేటాయింపులను భారీగా తగ్గించుకుంది. ముఖ్యంగా సాంకేతిక నైపణ్యంలో సత్తా చాటిన జపాన్ సైనిక పరంగా ఎక్కువగా పురోగతి సాధించలేకపోయిందనే చెప్పాలి.
మారుతున్న రాజకీయ పరిస్థితులతో పాటుగా చిరకాల శత్రువు చైనా సైనికపరంగా ప్రబలంగా తయారు కావడంతో జాపాన్ తన పంథాను మార్చుకుంది. ప్రపంచ రాజకీయ శక్తిగా ఎదగడానికి సైనిక శక్తి కూడా ప్రధానం అని గుర్తించిన జపాన్ ప్రస్తుతం తన సైనికబలగాలను పెంచుకుంటోంది. దీనితో పాటుగా ప్రపంచ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకుంటోంది. పక్కలో బల్లెంలాగా తయారైన చైనాను నిలువరించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు ప్రధానంగా భారత్ కు గట్టి స్నేహహస్తాన్ని అందిస్తోంది. భారత్-జపాన్ ల మధ్య మొదటి నుండి మంచి సంబంధాలే ఉన్నప్పటికీ అవి అనుకున్న మేరకు పురోగతిని సాధించలేకపోయాయి. సంప్రదాయాలు ఇతరత్రా కారణాలతో జపాన్ ఇతర దేశాలతో ప్రజలను పెద్దగా తన దేశంలోకి ఆహ్వానించే పరిస్థితులు లేవు. అయితే ప్రస్తుతం తన విధానాలను కొద్దిగా సడలించుకుంటూ జపాన్ ప్రపంచ రాజకీయాల్లో దుకుడుగా వ్యవహరిస్తోంది.
ఆసియాలో ఒకప్పుడు తన ఆర్థిక శక్తి ద్వారా చక్రం తిప్పిన జపాన్ ను చైనా దాటేయడంతో పాటుగా ఆసియా రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేయడం జపాన్ కు మింగుడుపడడం లేదు. దీనితో భారత్ తో తన మైత్రి బందాన్ని బలోపేతం చేయడానికి జపాన్ ముందడుగు వేస్తోంది. డోక్లామ్ వ్యవహారంలో ఇతర దేశాలకంటే ముందుగా భారత్ పూర్తి మద్దతు ప్రకటించిన జపాన్ అవసరం అయితే భారత్ కు అన్ని రకాల సైనిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నమంటూ బహిరంగంగా ప్రకటించింది. ప్రపంచంలో మరే దేశము భారత్ కు ఇంత బహిరంగంగా మద్దదు ప్రకటించలేదు. చైనా రాజకీయాలను కట్టడి చేయాలంటే భారత్ తో మైత్రిని మరింత బలోపేతం చేయాలని భావించిన జపాన్ పాలకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్ తో కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ముంబాయి-ఆహ్మదాబాద్ ల మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు కూడా ఇందులో ఒకటిగా చెప్తున్నారు. బుల్లెట్ ట్రైన్ విషయంలో మొదటి నుండి జపాన్ సంస్థలతో ప్రపంచంలో ఆధిపత్యం. అయితే ఈ రంగంలోకి ప్రవేశించిన చైనా జపాన్ ను దాటి ముందుకు వెళ్లిపోయింది. సాంకేతిక పరంగా జపాన్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ జపాన్ దేశపు బులెట్ ట్రైన్ వ్యయం చాలా ఎక్కువగా ఉండడంతో చైనా వైపు పలు దేశాలు మొగ్గు చూపాయి. ఈ క్రమంలోనే ఇండోనేషియా ప్రాజెక్టును చైనా తన్నుకుపోయింది. జపాన్ తో పోలిస్తే చాలా తక్కువ వ్యయానికే చైనా బులెట్ ట్రైన్ ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కిస్తుండడంతో చైనా కొత్త ప్రాజెక్టులను ఎగరేసుకుని పోతోంది. అయితే ధర ఎక్కువైన జపాన్ తో వ్యాహాత్మక మైత్రి బంధానికి ప్రధాన్యం ఇస్తున్న మోడీ సర్కారు బులెట్ ట్రైన్ ప్రాజెక్టును జపాన్ కే కట్టబెట్టింది. దీనితో పాటుగా జపాన్ కూడా తన ధరలను కొద్దిగా తగ్గించుకునే అవకాశాలున్నట్టు సమాచారం.
ఉభయ తారకంగా భారత్-జపాన్ లు మరింత దగ్గర అయేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా డ్రాగన్ కు కోపం తెప్పించక మానవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *