చైనా తో ఢీ అంటే ఢీ అంటున్న భారత్

సిక్కింలోని డోక్లామ్ వ్యవహారంలో చైనా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. చైనా బెదిరింపులకు బెదరని భారత్ వారి వ్యాఖ్యలను ధీటుగా తిప్పికొడుతోంది. డోక్లామ్ నుండి తమ సైనికులను వెనక్కి పిల్చే ప్రశక్తిలేదని భారత్ తెగేసి చెప్పడంతో చైనా ఈ వ్యవహారంలో ఎటుపోవాలో తెలియక తల పట్టుకుని కూర్చుని ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. డోక్లామ్ వ్యవహారంలో భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా వైఖరిని ప్రపంచ దేశాలు తప్పుబడుతుండడంతో డ్రాకన్ సర్కారుకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. భారత్ కు జపాన్ బాహాటంగా మద్దతు పలకడం చైనాకు ఏ మాత్రం రుచించడం లేదు. జపాన్ తో పాటుగా మరికొన్ని దేశాలు కూడా భారత్ కు బాసటగా నిలుస్తున్నాయి. బహిరంగంగా మద్దతు ప్రకటించనప్పటికీ అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వ్యవహారంలో భారత్ వాదనతో ఏకీభవిస్తోంది. దీనితో ఈ వివాదాన్ని ఏ విధంగా సర్థుబాటు చోసుకోవాలో తెలియక చైనా ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుని కూర్చున్నారు. తమ బెదిరింపులకు భారత్ భయపడుతుందని డోక్లామ్ నుండి సైన్యాలను ఉపసంహరిస్తుందని భావించిన చైనా కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. డ్రాగన్ ఎన్నిరకాలుగా ఒత్తిడి చేసినా భారత్ ఏ మాత్రం బెదరకపోవడంతో చైనా ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. భారత్ తో యుద్దానికి సైతం సిద్ధమంటూ చైనా దుండుకుగా వ్యవహరించినా భారత్ ఏ మాత్రం వెనక్కి మళ్లకపోవడం డ్రాగన్ సర్కారు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. చైనా ఎదుర్కోవడానికి సైతం తాము సిద్ధంగా ఉన్నామంటూ భారత్ చేసిన హెచ్చరికలు చైనాను ఖంగు తినిపించాయి.
ప్రంచ రాజకీయాల్లో పెద్దన్న పాత్రను పోషించాలని ఉవ్వీళ్లూరుతున్న చైనాకు భారత్ తో నెలకొన్న తాజా వివాదాలు తలనొప్పిగా మారాయి. భారత్ తో యుద్ధానికి దిగితే అది చైనా ఆర్థిక వ్యవస్థను ఎంతగా దిగజారుస్తుందో ఆ దేశానికి తెలియంది కాదు. ఇప్పటికే చైనా పై గుర్రుగా ఉన్న అమెరికా భారత్ కు మద్దతు ఇవ్వడం ఖాయమని తేలిపోయింది. అటు జపాన్ కూడా భారత్ మద్దతు ప్రకటించడంతో చైనా ఇంతటి దుస్సాహసానికి దిగుతుందని ఎవరూ అనుకోవడం లేదు. మరో వైపు ఇప్పటికే ఉత్తర కొరియాకు మద్దతు ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ సమాజంలో చెడ్డ పేరు సంపాదించుకున్న చైనా ఇప్పుడు భారత్ పై దాడి చేయడం ద్వారా మరింత అప్రదిష్టను మూటకట్టుకోవాల్సి వస్తుంది. భారత్ లాంటి శక్తివంతమైన దేశంతో యుద్ధం చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదన్న సంగతి చైనాకు కూడా తెలుసు. ఇప్పటి పరిస్థితుల్లో భారత్ ఒత్తిడికి తలొగ్గి డోక్లామ్ నుండి వెనక్కి వెళ్లడమా లేకా దూకుడుగా ముందుకు వెళ్లడమా అర్థం కాని పరిస్థితిలో చైనా ఇరుక్కుని పోయి ఉంది.
భారీ సైనిక విన్యాసాలు జరపడం ద్వారా భారత్ ను బెరించాలనే చైనా ఎత్తులు కూడా సాగలేదు. చైనా ఆయుధ పాటవాన్ని ఎంతగా ప్రదర్శించినా భారత్ వైఖరిలో కొద్దిగా కూడా మార్పు రాకపోవడంతో పాటుగా భారత్ కూడా అమెరికా, జపాన్ లతో కలిసి సైనిక విన్యాసాలు చేయడంతో చైనా పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. అయితే కుటిల రాజీకాయలకు పెట్టింది పేరైన చైనాను తక్కువగా అంచానా వేయడానికి వీలు లేదని భారత్ అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అంటున్నారు. అవసరం అయితే ఒక్కోసారి వెనక్కి తగ్గేందుకు కూడా చైనా వెనుకాడదని ఆ తరువాత అదను చూసుకుని విరుచుకుని పడే తత్వం వారిదని అంటున్నారు. మొత్తం మీద డోక్లామ్ వ్యవహారంలో భారత్ వైఖరి చైనాకు మింగుడుపడడం లేదన్నది మాత్రం వాస్తవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *