హరీష్ రావు అమిత్ షాను కలిసింది నిజంకాదా: రేవంత్ రెడ్డి

తెలంగామ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉంటున్నారని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు పార్టీ నుండి బయటకు వచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారని అయితే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మాత్రమే ఆయన టీఆర్ఎస్ లో ఉంటున్నారని బయటకు వచ్చే అవకాశం లేకనే కాంగ్రెస్ పార్టీపై హరీష్ విమర్శలు చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. హరీష్ రావు టీఆర్ఎస్ నుండి బయటికి రావాలని ప్రయత్నం చేశారా లేదా అన్న విషయం ఆయన మనస్సాక్షికి తెలుసన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను హరీష్ రావు కలవలేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ మారడానికి కాకుంటే అమిత్ షాను మరి ఎందుకు కలిశారని దీనిపై హరీష్ వివవరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలోనూ హరీష్ రావు టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చే ప్రయత్నాలు చేశారని అందుకోసమే నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని కలిసిన సంగతి నిజంకాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన బండారం బయటపడేసరికి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు.