గురుకుల విద్యార్థి ఉసురు తీసిన నిర్లక్ష్యం?

0
74
గురుకుల పాఠశాల విద్యార్థి మృతి

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక గురుకుల పాఠశాల ల్లోనూ నిర్వహణా లోపాలు, సిబ్బంధి నిర్లక్షం ఎక్కువయ్యాయనే ఆరోపణలున్నాయి. హాస్టల్ లో ఉంటున్న విద్యార్థుల బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలున్నాయి. గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న ఓ చిన్నారి అర్థంతరంగా తనువు చాలించిన విషాధ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకులు నిర్లక్ష్యం వల్లే చిన్నపాటి అనారోగ్యం కూడా లేని తమ కుమారుడు చనిపోయాడని చిన్నారి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. www.telanganaheadlines.in వెలుగులోకి తెచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇట్లా ఉన్నాయి.
హైదరాబాద్ లోని సైదాబాద్ పూసల బస్తీకి చెందిన బి.రాములు, బి.సంధ్య దంపతుల కుమారుడు బిజ్జి వివేక్ ఇబ్రహీంపట్నం, మంచాల మండలం , నోముల గ్రామ సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ రెసిడెన్సియల్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. గురుకుల సెట్ లో మంచిమార్కులు సాధించి చంద్రాయణగుట్ట పాఠశాలలో ప్రవేశాన్ని సంపాదించుకున్నాడు. చంద్రాయణగుట్ట పాఠశాలకు చెందిన రెసిడెన్సియల్ పాఠశాలను ఇంబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్నారు. చదువుల్లో చురుగ్గాఉండే తన కుమారుడిని గురుకుల పాఠాశాలలో చేరిస్తే వాడి భవిష్యత్తు బంగారు మయం అవుతుందని కలలు కన్న తల్లిదండ్రులు బాలుడిని హాస్టల్ లో చేర్పించారు.
బోనాల పండక్కి తన కుమారుడిని ఇంటికి తీసుకుని వచ్చేందుకు హాస్టల్ కు వెళ్లగా వివేక్ కు జ్వరం వచ్చినట్టు తెలిపారని మృతుని తండ్రి చెప్పారు. ఐదు రోజులుగా తన కుమారుడికి తీవ్ర జ్వరంగా ఉన్నప్పటికీ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తీరా ఇంటికి బయలు దేరుతున్న సమయంలోనే హాస్టల్ గేటు వద్దే తన కుమారుడు వాంతులు చేసుకున్నాడని ఇంటికి తీసుకుని వచ్చి డాక్టర్ కు వద్దకు తీసుకుని వెళ్లామని అప్పటికే జ్వరం చాలా ఎక్కువగా ఉందని చెప్పిన డాక్టర్ మందులు ఇచ్చారని తెలిపారు. ఆ తరువాత పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా అక్కడే తన బిడ్డ చనిపోయాడని వివేక్ తల్లిదండ్రులు వాపోయారు. జ్వరం వస్తే ఒక్కసారిగా పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండదని కనీసం నాలుగైదు రోజులకన్నా ఎక్కువరోజుల నుండే వివేక్ జ్వరంతో బాధపడి ఉండవచ్చని స్థానిక డాక్టర్లు చెప్పినట్టు వారు పేర్కొన్నారు. ఇన్ని రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నా కనీస వైధ్యం అందించకుండా హాస్టల్ నిర్వహాకులు నిర్లక్ష్యం వహించారని దీనివల్లే తమ బిడ్డ చనిపోయాడని వారు విలపిస్తున్నారు.
తన బిడ్డ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కేవలం ప్యారాసెటిమాల్ మాత్ర మాత్రమే ఇచ్చారని కనీసం బిడ్డ ఆరోగ్యపరిస్థితి గురించి తమకు చెప్పలేదని వివేక్ తండ్రి రాములు తెలిపారు. వివేక్ జ్వరంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని హాస్టల్ లోని సిబ్బంది దృష్టికి తోటి పిల్లలు తీసుకుని వెళ్లారని అయినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన చెప్తున్నారు. వివేక్ సహచర విద్యార్థులు కూడా విషయాన్ని చెప్తున్నారని తీవ్రమైన జ్వరంతో ఉన్న చిన్నారికి సరైన వైద్యం అందించకపోవడం వల్లే తన బిడ్డ తమకు కాకుండా పోయాడని ఆయన విలపిస్తున్నారు. తన కుమారుడు ఆనారోగ్యంతో ఉన్న విషయాన్ని తమకు ఎందుకు చెప్పలేదని అడిగితే హాస్టల్ సిబ్బంది తలోరకంగా సమాధానం చెప్తున్నారని అన్నారు.
నాలుగవ తరగతి వరకు సుల్తాన్ షాహీలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన వివేక్ చదువులో చురుగ్గా ఉండేవాడని దీనితో మంచి విద్యకోసం గురుకుల పాఠశాలలో చేర్చామని అక్కడి సిబ్బంది నిర్వాకం వల్ల తమ బిడ్డ తమకు కాకుండా పోయాడని వివేక్ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఈ వ్యవహారంలో విద్యాశాఖ వెంటనే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వివేక్ తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డకు ఎటూ తమకు దక్కకుండా పోయాడని ఇతరుల విషయంలో కూడా ఇటువంటి నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి వారు కోరుతున్నారు.
చర్యలు తీసుకోవాలి:విద్యార్థి సంఘాలు
గురుపాఠశాల విద్యార్థిని మృతిపై తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైనేషన్ రాష్ట్ర అధ్యక్షుల లక్ష్మీ నివాస్ సంతాపం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో సరైన వైద్య సదుపాయాలు లేవని సత్వరం విద్యార్థులకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థకి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, సరైన వైద్యం అందిచకుండా నిర్లక్ష్యంగా వ్యవహిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మీనివాస్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో కొన్ని అధ్వాన్నంగా తయారయ్యాయని కనీస సౌకర్యాలు కరువయ్యాయని తెలిపారు. విద్యార్థుల సమస్యలను హాస్టల్ సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థి వివేక్ మృతికి దారితీసిన పరిస్థితులపై తక్షణం ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మా తప్పేంలేదు: ప్రిన్సిపల్
తమ విద్యార్థి బి.వివేక్ చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రిన్సిపల్ విజయ్ కుమార్ అన్నారు. తనకు జ్వరం వచ్చిన మాటవాస్తవమేనని అయితే తాము వెంటనే అతనికి చికిత్స అందించామన్నారు. హాస్టల్ లో 24 గంటలు నర్స్ అందుబాటులో ఉంటారని వారి ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులకు చికిత్స చేయిస్తామని వెల్లడించారు. వివేక్ కు కూడా చికిత్స అందించామని, తడిబడ్డతో ఒళ్లు తుడిచారని చెప్పారు. వివేక్ ను అతని తండ్రి హాస్టల్ నుండి తీసుకుని వెళ్లిన రోజే జ్వరం వచ్చిందని అందుకే వారికి సమాచారం ఇవ్వలేదన్నారు. విద్యార్థి చనిపోవడంలో తమ నిర్లక్ష్యం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం


వేల చండీయాగాల నిర్వాహకులు పాలకుర్తి నరసింహా రామ సిద్ధాంతి మృతి

Wanna Share it with loved ones?