అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో జరగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. పోర్ట్ లాండ్రియల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. ఎయిర్ పోర్టులోని సామాన్లు తీసుకునే బెల్ట్ వద్ద హఠాత్తుగా ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. తన చెకిన్ బ్యాగేజీలో ఉన్న తుపాకిని తీసి విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ఐదురుగు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ప్రయాణికులు చెల్లా చెదురయ్యారు. అరుపులు హాహా కారాలతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఇరాక్ లో యుద్ధంలో పాల్గొన్నాడని పోలీసులు గుర్తించారు. 26 సంవత్సరాల ఎస్తబాన్ శాంటియగో అనే యువకుడు ఈ కాల్పులకు తెగబడినట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసకున్నారు.
కాల్పులకు తెగబడిన వ్యక్తి ఇటీవల ఎఫ్.బి.ఐ కార్యాలయంలోనూ దుందుడుకుగా వ్యవహరించినట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనను ఉగ్రకోణంలోనూ విచారిస్తున్నట్టు పోలీసులు వెళ్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.