భారీ వరదలతో టెక్సాస్ అతలాకుతలం

అమెరికాలోని టెక్సాస్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. హరికేన్ ధాటికి టెక్సాస్ రాష్ట్రం వణికిపోయింది. ప్రధానంగా హ్యాస్టన్ నగరంలో భారీగా దెబ్బతినింది. ఈ నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రెండు రోజుల్లో 74 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్ని జలాశయాలుగా మారాయి. ఈ వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతున్న సుమారు 250 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. నగరంలోని 200 మంది భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టెక్సాస్ లో తెలుగు వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. తెలుగు వారంతా క్షేమంగానే ఉన్నారని ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్థానిక తెలుగు సంఘాలు వెల్లడించాయి. ఎయిర్‌పోర్టులు, బస్సు సర్వీసులు, స్థానిక రవాణా సేవలు నిలిపివేశారు. అత్యవసర సర్వీసులు మాత్రమే కొనసాగిస్తున్నారు. పాఠశాలలకు గురువారం వరకు సెలవులు ప్రకటించారు. ప్రజలు బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత వంద సంవత్సరాల్లో ఇంత భారీ వర్షాలు ఎప్పుడు కురవలేదని సమాచారం.