హింధువుల పండుగలపైనే ఎందుకీ రచ్చ

డి.వి.సాయి కృష్ణ
దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను దీపావళి పండక్కి దూరం చేసిన సుప్రీం కోర్టు తీర్పు మనసును కలచి వేస్తోంది. కాలుష్యాన్ని సాకుగా చూపిస్తూ ప్రజలను పండక్కి దూరం చేయడం ఎంతవరకు సమంజసం. హింధువులు జరుపుకునే పండగల సమయాల్లోనే కొంత మందికి కాలుష్యంపై అవగాహన పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. పండగలకి ప్రజలను దూరం చేసేందుకు కంకణం కట్టుకుని మరీ వారు చేస్తున్న ప్రయత్నాలకు కోర్టులు కూడా మద్దతు పలకడం శోచనీయం. బాణాసంచాను నిషేధించినంత మాత్రాన కాలుష్యం దూరం అవుతుందా… ఒక్కో రోజులోనే ప్రజలు భరించలేనంత కాష్యాన్ని బాణాసంచాలు వెదజల్లుతున్నాయా..వాతావరణాన్ని తూట్లు పొడుస్తూ రోజూ కాలుష్యాన్ని వెదజల్లుతున్న బడా పారిశ్రామిక సంస్థలపై ఎందుకు కొరడా జుళిపించరు.. కాలుష్యం పేరుతో కేవలం ఒక మతానికి చెందిన పండుగల పైనే ఎందుకు ఇంతగా ప్రచారం చేస్తున్నారు… ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. లావుగా ఉన్న వ్యక్తి సంవత్సరమంతా తిని కూర్చుని ఒక్క రోజు పూర్తిగా ఉపవాసం ఉండి లావు తగ్గాలని అనుకున్నాడట. ఇది ఎంత హాస్యస్పదంగా సత్యదూరంగా ఉందో కాలుష్యాన్ని సాకుగా చూపి దీపావళికి దూరంగా ఉండడం కూడా అట్లాగే కనిపిస్తోంది.
అనాగరికం పేరుతో ఆచారాలను… కాలుష్యం పేరుతో పండుగలను ప్రజలకు దూరం చేస్తున్నారు. ఎన్జీఓల పేరుతో ఒక మతం పై జరుగుతున్న దాడిగానే ఇవన్నీ కనిపిస్తున్నాయి. జల్లికట్టు పై తమిళనాడులో జరిగిన ఆందోళన మనమంతా చూశాం. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గళం విప్పిన అక్కడి ప్రజా సంఘాలు అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని అనాగరికం పేరుతో అడ్డుకోవడం సరైంది కాదంటూ ఉవ్వేత్తున ఎగిసిపడిన ఉధ్యమానికి ప్రభుత్వం తలవంచక తప్పలేదు. చట్టాల అధారంగానే కోర్టులు తీర్పునిస్తాయని మనందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో బాణా సంచా పై నిషేధానికి మొగ్గు చూపడం దురదృష్టకరం. కాలుష్యంపై మన ఏలికలకు ఇంత ప్రేమే ఉంటే విచ్చలవిడిగా వాతావరణానికి తూట్లు పొడుస్తున్న కారణాలను అన్వేషించడంలోనూ వాటిని అరికట్టడంలోనూ ఎందుకు విఫలం అవుతున్నారో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది.
దేశంలో హింధూ పండుగలు వస్తున్నాయంటే చాలు వాటికి ముందే వివాదాలు, కాలుష్యం ఇతరత్రా రాద్దాంతం చేయడానికి కొంతమంది కాచుకుని కూర్చున్నట్టు కనిపిస్తోంది. శివరాత్రి నాడు శివుడికి పాలు అభిషేకం చేయడం దగ్గర నుండి హోళీ రంగుల దాకా… ప్రతీ అంశాన్ని వివాదం చేయడంతో పాటుగా హిందువుల ఆచార వ్యవహారాలను అవహోళన చేయడం ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్ గా మారింది. కొన్ని మీడియా సంస్థలు ఇటువంటి వారికి వత్తాసు పలుకుతూ చర్చల పేరుతో భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. హిందూ సంస్కృతికి పై బ్రిటీషు కాలం నాటికంటే ఇటీవల కాలంలోనే ఎక్కువ దాడులు జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
లౌకిక వాదం అంటే హింధువులను వ్యతిరేకించడం గానే కనిపిస్తోంది. లౌకిల వాద ముసుగులో హిందువులను లక్ష్యంగా చేసుకుని వారిపై విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచీతూచీ వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(ఈ వ్యాసం రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు… ఈ వెబ్ సైట్ కు వీటితో ఎటువంటి సంబంధం లేదు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *