ఫెడరల్ ఫ్రంట్ కోసం లోక్ సభకు కేసీఆర్?

ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లో తన సత్తాను చేటే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. బీజేపీ, కాంగ్రేసేతర పక్షాలను కలుపుకుంటూ జాతీయ స్థాయిలో బలమైన శక్తిగా మారేందుకు కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తాను చేస్తున్న ప్రయత్నాలను ఆషామాషీగా తీసుకోవద్దంటూ ఇప్పటికే స్పష్టం చేసిన కేసీఆర్ ఆ దిశగా చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర మఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తునే హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ రాజకీయాలను శాసించడం కష్టంకాదని ప్రకటించినా పూర్తి స్థాయిలో ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పాలనే యోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
జాతీయ స్థాయి రాజకీయాల కోసం కేసీఆర్ లోక్ సభకు పోటీచేసి ఢిల్లీకి వెళ్లాలనే ప్రతిపాదన కూడా పార్టీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తారని అప్పట్లోగా రాష్ట్ర పగ్గాలను తనయుడు కేటీఆర్ కు అప్పగిస్తారనే ప్రచారం కూడా పార్టీలో కొనసాగుతోంది. కేసీఆర్ లోక్ సభ కు ఎంపికవడం ద్వారా జాతీయ స్థాయి రాజకీయాల్లో తన దైన ముద్రవేయడానికి అవకాశం ఏర్పడుతుందని పార్టీలోని కొంత మంది భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ తో పాటుగా పార్టీలోని కొంత మంది కీలక నేతలు కూడా లోక్ సభకు పోటీచేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి లోక్ సభకు పోటీచేయడం దాదాపుగా ఖరారయిందనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ దఫా మంత్రి వర్గంలో కడియంకు చోటు దక్కదని ఆయన సేవలను పార్టీ జాతీయ స్థాయిలో వినియోగించుకుంటుందని తెలుస్తోంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు కూడా లోక్ సభకు పోటీచేస్తారని అంటున్నారు.
తాను జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయనేదానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతంగా మంతనాలు సాగిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీతో పాటుగా ముఖ్యమంత్రి పదవిని కూడా కేటీఆర్ కు అప్పగిస్తే పరిణామాలు ఎట్లా మారుతాయనేదానిపై కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు అత్యంత నమ్మకస్తులైన కొంత మంది నేతలతో ఆయన ఈ మేరకు సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అంతా అనుకూలంగా ఉంటే లోక్ సభకు కేసీఆర్ పోటీచేయడం తధ్యమని ఆ వర్గాలు చెప్తున్నాయి.Can ‘Shakthi” really decide the contestent