ఎక్స్ ప్రెస్ టీవీ ఆస్తులు అటాచ్ చేసిన కోర్టు

ఎక్స్ ప్రెస్ టీవీ ఆస్తులను తెలంగాణ రాష్ట్ర లేబర్ కోర్టు అటాచ్ చేసింది. తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ సిబ్బంది చేసిన ఫిర్యాదు మేరకు ఆస్తులను అటాచ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ టీవీ ప్రసారాలు నిలిపివేసింది. దాదాపు 12 నెలల జీతాలు బకాయి ఉన్నట్టు సమాచారం. ఒక మీడియా సంస్థ ఆస్తులను అటాచ్ చేయడం ఇదే మొదటిసారని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు. టీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు క్రాంతి,మారుతీ సాగర్,ఇస్మాయిల్ లతో కలిసి ఆయన మాట్లాడారు .ఎక్స్ ప్రెస్ టీవీ యాజమాన్యం ఏడాదిగా జర్నలిస్టులకు,ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని,టీ యూ డబ్ల్యూ జే తరుపున యాజమాన్యాన్ని సంప్రదించినా స్పందన లేదని వేతన బకాయిలను రాబట్టడానికి మరో మార్గం లేక లేబర్ కమిషన్ ను సంప్రదించామని ఆయన తెలిపారు. యూనియన్ పక్షాన ఎక్స్ప్రెస్ టీవీ కార్యాలయం ముందు ఎంత ఆందోళన చేసినా వారు ఏ మాత్రం స్పందించక పోవడంతో లేబర్ కమిషన్ లో కేసు ఫైల్ చేయడంతో వాద ప్రతివాదనలు విన్న కమిషన్ మంగళవారం tuwj పక్షాన పిటిషన్ వేసిన యూనియన్ కోశాధికారి మారుతి సాగర్,ఎక్స్ ప్రెస్ టీవీ ఎంప్లాయిస్ పక్షాన నిలిచి సదరు యాజమాన్యానికి చెందిన 3 .5 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిందని వివరించారు. మీడియా విస్తరించాలని,ఎదగాలని,లాభాలు గడించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కోరుకుంటోందని ,అయితే జర్నలిస్టులకు జీతాలు ఎగ్గొట్టినప్పుడు మాత్రం ఇట్లాంటి చర్యలు అనివార్యంగా భావించి ముందుకు వెళ్తామని ,జర్నలిస్టుల ప్రయోజనాల కోసం యూనియన్ ఎంత దూరమైనా వెళ్తామన్నారు. ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగుల పక్షాన గత ఎనమిది నెలలుగా నిలబడి వారికి అండగా నిలిచిన యూనియన్ నాయకులు క్రాంతి,మారుతీసాగర్,యోగి,ఇస్మాయిల్ లను ఈ సందర్బంగా అభినందించారు . అటాచ్ చేసిన ఆస్తులను వేలంపాట ద్వారా విక్రయించి కోటిన్నర వేతన బకాయిలను ఉద్యోగులకు చెల్లించాలని అల్లం నారాయణ డిమాండ్ చేసారు .కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు లియాకత్ అలీ,శివాజీ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *