ఎందుకీ ముందస్తు… అసలు కారణాలు ఏంటి?

early elections in telangana తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగడం దాదాపు ఖాయమని తేలిపోయింది. అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకున్నా జరుగుతున్న పరిణామాలు అన్నీ ముందస్తు ఖాయమనే సంకేతాలనే ఇస్తున్నాయి. రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ దూకుడు తదితర పరిణామాలన్నీ ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. గడువు కన్నా ముందే ఎన్నికలను గురించి తాను ఎటువంటి ప్రకటన చేయలేదని అవన్నీ మీడియా ఊహాగానాలేనని కేసీఆర్ కొట్టిపారేస్తున్నా ఆయన చర్యలు అసలు విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. కేసీఆర్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే.
గడువుకన్నా ముందరే దేశంలో ఎన్నికలు జరుగుతాయని గత ఏడాదిగా ప్రచారం జరుగుతూనే ఉంది. లోక్ సభ ఎన్నికలు కూడా ఆరు నెలలు ముందే జరుగుతాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వచ్చినా బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయలేకపోయింది. మారిన పరిస్థితుల దృష్ట్యా ముందస్తు అంత మంచిదికాదనే ఆలోచనల పడిన కమలనాధులు దానికి దూరంగానే ఉండిపోయారు. అయితే కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. గడుపువుకు ముందే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.
అనుకూల వాతావరణం
ప్రస్తుతం టీఆర్ఎస్ కూ పూర్తి అనుకూల వాతావరణం ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అందుతున్నాయి.ఇదే ప్రభుత్వం కొనసాగితే ప్రభుత్వ పరంగా తమకు మరింత లాభం కలుగుతుందనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నట్టు వివిధ సర్వేలు వెల్లడించడంతో ప్రజల అభిప్రాయం మారకముందే ఎన్నికలకు వెళ్లడం ఉత్తమమనే అభిప్రాయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. రైతు బంధు పథకం, నిరంతర విద్యుత్, చకచకా పూర్తవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం చురుగ్గా సాగుతున్న మిషన్ భగీరథ పనులు, ఉచిత కంటి పరీక్షలు, వివిధ వర్గాల ప్రజలకు అందిస్తున్న సబ్సీడీలు మంచి కార్యక్రమాలతో ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేరువయ్యింది. ప్రస్తుతం ప్రభుత్వం పై ఉన్న ‘ ఫీల్ గుడ్ ‘ ఇమేజ్ ను ఓట్ల రూపంలో మల్చుకోవడానికి ఇదే మంచి అవకాశమని భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతోంది.
బలహీన విపక్షం
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ఆ పార్టీ సహజంగానే సిద్ధంగా లేదు. అధికార పక్షానికి ఉన్నన్ని వనరులు కాంగ్రెస్ పార్టీకి లేవు. ఎన్నికలకు మానసికంగా ఆ పార్టీ సిద్ధంగా లేదు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన తరువాత పార్టీ కొంత మేర చురుగ్గా మారినా ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పుంజుకోలేదు. ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు గట్టిగా కొట్టాలనే సిద్ధాంతాన్ని నట్టిగా నమ్మే కేసీఆర్ బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ను చావుదెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం ఉందనే సూచనలు వస్తుండడంతో ఆ ప్రభావం రాష్ట్రంపై పడకుండా ముందుజాగ్రత్తులు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి పెద్ద సంక్యలో టీఆర్ఎస్ లోకి నాయకులు వలసలు వచ్చారు. మరికొంతమంది అదే బాటలో ఉన్నట్టు సమాచారం. ఎన్నికల ముందు పార్టీలోకి కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడం ద్వారా వారిని మరింత గట్టి దెబ్బకొట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. పనిలోపనిగా పార్టీలోని అసంతృప్త నేతలు పక్కచూపులు చూడకుండా ఉండేందుకు కూడా ముందస్తు వ్యూహా పనిచేస్తుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నట్టు సమాచారం.
బీజేపీ పై వ్యతిరేకత
దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి. త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత బీజేపీకి మరింత ఎదురుగాలి వీచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము బీజేపీకి ఎంతమాత్రం అనుకూలం కాదని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ టీఆర్ఎస్ ను బీజేపీ అనుకూల పార్టీగానే ప్రజలు చూస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. మోడీ వ్యతిరేక పవనాల తమపై పడకుండా ముందుజాగ్రత్త చర్యలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారం 2019 మే లోనే ఎన్నికలు జరిగితే…అప్పటికి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ బలపడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ కు కొన్ని సీట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ నిర్వహించిన సర్వేల్లోనూ కొన్ని చోట్ల టీఆర్ఎస్ కు- కాంగ్రెస్ కు మధ్య ఓట్ల మార్జిన్ తక్కువగా ఉండడంతో లోక్ సభ ఎన్నికల సమయంలో జరిగే రాజకీయ సమీకరణాల వల్ల కాంగ్రెస్ లాభపడుతుందనే నమ్మకం గట్టిగా ఉండడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీఆర్‌ఎస్‌ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీతో పొత్తుకు వెళ్తుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీని వల్ల మైనార్టీ ఓట్లు టీఆర్‌ఎస్‌కి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
ముందస్తుకు ఇది కూడా ఓ కారణమే. లోక్ సభకు, అసెంబ్లీకి ఎకేసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని పరిణామాలతో పాటుగా దేశంలోని పరిణామాలు ఓటర్లను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. టీఅర్ఎస్ ప్రభుత్వంపై ఓటర్లు సంతృప్తిగా ఉన్నప్పటికీ దేశ పరిస్థితుల రిత్యా కొన్ని ఇబ్బందులు తప్పేట్లు లేవు. దీనివల్ల ముందుస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఆ ఇబ్బందులను తప్పించుకునే అవకాశం లభిస్తుందనేది గులాబీ బాస్ ఆలోచన. రాష్ట్రంలో గట్టి మెజార్టీతో అధికారంలో వచ్చిన తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా మరిన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు. అప్పుడు కేంద్రంలో ఉన్న రాజకీయ సమీకరణాలను బట్టి చక్రం తిప్పొచ్చన్నది కేసీఆర్ వ్యూహం. ఆపై కేసీఆర్ చెప్తున్న ఫెడరల్ ఫ్రంట్‌ కోసం జాతీయ స్థాయిలో పర్యటించేందుకుకూ వీలుదొరుకుతుంది.
రాష్ట్రంలో భారీ మెజార్టీతో అసెంబ్లీలో విజయం సాధించడం ద్వారా లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మానసికంగా దెబ్బకొట్టే వ్యూహం పన్నారు కేసీఆర్.
అయితే కేసీఅర్ వ్యూహాలు ఎంత వరకు పనిచేస్తాయో చూడాలి. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు నాయుడు, ఎస్.ఎం.కృష్ణతో పాటుగా కేంద్రంలోని వాజ్ పేయి సర్కార్లకు ఎదురుదెబ్బలు తగిలిన సంగతి గమనార్హం.
బి.వి.ఎల్.కే.మనోహర్
early elections, early elections in telangana,trs, telangana government, telangana cm, telangana cm kcr.

వాళ్లకే టికెట్లిస్తే మా పరిస్తితి ఏంటి -టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి


వాళ్లకే టికెట్లిస్తే మా పరిస్తితి ఏంటి -టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి