బిర్యానీలో కుక్కమాంసం… అసలు
హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో తయారు చేస్తున్న బిర్యానీలో కుక్క మాంసం కలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిన కథనానికి సంబంధించిన అసలు విషయాన్ని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి అసలు విషయాన్ని పోలీసులు బయటపెట్టడంతో పాటుగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రచారంతో సదరు హోటల్ యాజమాన్యం మాత్రం కొద్దిరోజుల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
అసలు విషయానికి వస్తే నగరంలోని ప్రముఖ హోటళ్లలో షాగౌస్ ఒకటి ఇక్కడ నిత్యం పాతనగరానికి చెందిన వలబోజ చంద్రమోహన్ అతని స్నేహితులు బిర్యాని తినేవారు. బిర్యాని తినిపించమని స్నేహితుల నుండి తప్పించుకోవడానికి ఒక పథకం పన్నాడు. కుక్కమాంసం ఆహరపదార్థాల్లో ఉపయోగిస్తున్నారంటూ ఒక వాట్సప్ చిత్రం ప్రచారంలోకి వచ్చింది దాన్ని వాడుకుని షాగౌస్ బిర్యానీలో కుక్కమాంసం అమ్ముతున్నారని దీనితో హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారంటూ ఫొటో ఎడిటర్ సహాయంతో ఒక చిత్రాన్ని రూపొందించి తన స్నేహితుల గ్రూప్ లో పెట్టాడు. అంతే ఈ చిత్రం వైరల్ గా మారింది. అందరూ దీన్ని షేర్ చేసుకుంటూ పోవడంతో ఈ వార్త విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
పెద్ద ఎత్తున కుక్కమాంసం అంటూ ప్రచారం సాగడంతో జీహెచ్ఎంసీ హోటల్ నుండి నమూనాలను సేకరించింది. దీనితో హోటల్ యజమాని అరెస్ట్ అంటూ మరోసారి ఈ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై షాగౌస్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అసలు విషయాన్ని బయపెట్టారు. హోటల్ పై తనకు ఎటువంటి శతృత్వం లేదని సరదాకు చేసిన పని ఇంత ప్రచారం అవుతుందని ఊహించలేదని ఆ వ్యక్తి అంటున్నాడు. సరదా కోసం చేసిన పని ఇప్పుడు అతని కే ఎసరు తెచ్చిపెట్టింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మరో వైపు తమ హోటల్ పై సాగిన విషపు ప్రచారానికి సంబంధించి అసలు విషయం బయటకు రావడం పట్ల షాగౌస్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.