Dignity of labour … అంటే ఏమిటీ మమ్మీ…

dignity of labour …. dignity of labour …. అంటూ బట్టీ పడుతున్న 9వ తరగతి చదువుతున్న రమణను పిల్చింది వాళ్లమ్మ సువర్ణ… విసుక్కుంటూ లేచిన రమణ ఏంటమ్మా అంటూ వచ్చాడు. పనిమనిషి రాలేదురా కొంచెం వాళ్ల ఇంటిదాకా వెళ్లు అని చెప్పగానే గట్టిగా అరవడం మొదలు పెట్టాడు ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీ చదువుకునేటపుడు డిస్టబ్ చేయవద్దని రేపు ఎస్సే రైటింగ్ కాంపిటేషన్ ఉందని చెప్పాను కదా… మేడే ఎస్సే కోసం ప్రిపేర్ అవుతున్నాను నేను వెళ్లను ఖరాఖండీగా చెప్పేశాడు.
ఎప్పుడూ ఇంతే ఒక రోజు వస్తే నాలుగు రోజులు డుమ్మా కొడుతుంది … జీతం మాత్రం టైం కి తీసుకుంటుంది అంటున్న తల్లికి మద్దతు పలుకుతూ అవునమ్మా ప్రతీ సండే ఇంతే, లేట్ గా వస్తుంది. మరీ ఆమెకు బాగా అలుసయిపోయింది అగ్నిలో ఆజ్యంపోస్తున్న సమయంలోనే వచ్చేసింది పనమ్మాయి. ఆమె వస్తూనే అమ్మా కొడుకులు అంతెత్తున ఎగిరి పడ్డారు. నీకు టైం విలువ తెలీదు.. మ్యానర్స్ లేదు అంటూ గయ్యిమని లేచారు. తన కొడుక్కి ఆరోగ్యం బాగాలేదని అందుకనే లేట్ అయిందని, ఆమె చెప్తున్న మాటలు వీళ్ల చెవికి ఎక్కడం లేదు.
ఇంతలో కాలింగ్ బెల్ మరోసారి మోగడంతో డోర్ తీసిన రమణ మరోసారి గట్టిగా అరిచాడు “మమ్మీ పేపరోడు వచ్చాడు” అంటూ పేపర్ వేసే కుర్రాడు కూడా దాదాపు రమణ వయసువాడే.. ఏంటీ నెలాఖరున వచ్చావ్ విసుక్కుంటూ వచ్చింది రమణ తల్లి. స్కూల్ ఫీజ్ కట్టాలమ్మా ఈ నెల కొంచెం ముందుగా పేపర్ బిల్లు ఇవ్వండని అడిగిన కుర్రాడిపై విరుచుకుని పడిపోయింది. నాలుగు రోజుల ముందే డబ్బులు ఇచ్చేయాలా.. ఇవి తీసుకుని పేపర్ వేయకపోతే మాకు నష్టం కాదా ఏదో కుంటిసాకులు చెప్తారు నీ లాంటి వాళ్లంటూ అరుస్తూ ఉండిపోవడంతో వెళ్లిపోయాడా పేపర్ బాయ్…
ఒకసారి పనిమనిషి, మరోసారి పేపర్ కుర్రాడిని తిట్టుకుంటున్న సమయంలోనే కాలింగ్ బెల్ మోగింది. ఎదురుగా చెత్త తీసుకుని వెళ్లే అతను వచ్చాడు. “మమ్మీ చెత్తోడు వచ్చాడు” ఇంకోసారి గట్టిగా ఆరిచాడు రమణ. చెత్తేడు అంటూ అందరు పిలవడం అతనికి అలవాటయిపోయింది. విసుక్కుంటూ బయటికి వచ్చిన సువర్ణ ఏంటని అడుగుతూ… చెత్తసరిగా తీసుకుని పోవడం లేదని రెండు రోజులకు ఒకసారి వస్తున్నారని అరవడం మొదలు పెట్టింది. అతను మాత్రం అవేవీ పట్టించుకోకుండా మీరు చెత్తబుట్టలో పగిలిన గాజు పెంకులు కూడా వేస్తున్నారు చూడండి ఎట్లా కోసుకుని పోయిందోనని చూపించాడు. అయినా అవేవీ ఆమె పట్టించుకోకుండానే సరేలే చూస్తాం అంటు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయింది…
అటు తర్వాత కూరల మార్కెట్ లోనూ, కిరాణా దుకాణం లోనూ, సువర్ణను చాలా ఇబ్బందులు పెట్టేశారు లేబర్ జనాలు… తల్లితో పాటు వెళ్లిన రమణ మనసంతా తాను రేపు రాయబోయే ఎస్సే రైటింగ్ కాంపిటేషన్ పైనే ఉంది. ఈసారి ఎట్లాగైనా ఫ్రైజ్ గెల్చుకుని రాంగోపాల్ గాడి ఫోజులు తగ్గించాలని ఎంత ట్రై చేస్తున్నా చదవడం కుదరడంలేదనే అతని బాధ… అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తరువాత టిఫిన్ చేసి తీరిగ్గా తల్లి కొడుకులు కూర్చున్నారు..
రమణ మళ్లీ చదవడం (బట్టీ పట్టడం) మొదలు పెట్టాడు dignity of labour …. dignity of labour అంటూ. తల్లి సువర్ణ వాట్సప్ లో ఏదో మంచి కొటేషన్ చదువుతోంది “All labor that uplifts humanity has dignity and importance and should be undertaken with painstaking excellence. …” దాన్ని తన వాట్సప్ గ్రూపులకు, బంధువలకు, స్నేహితులకు పంపడంలో బీజీగా ఉంది.. పాపం రమణకు చాలా పెద్ద సందేహమే వచ్చింది. మమ్మీ “dignity of labour” అంటే ఏంటని. వెంటనే గూగుల్ వెతకడం మొదలు పెట్టిన సువర్ణకు దాని సమాధానం దొరికింది. కానీ అర్థం మాత్రం ఎప్పుడు తెలుస్తో మరి….