తెలంగాణలో పోలీస్ సేవలు దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తాయని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. సాంకేతికంగా దేశంలోనే మన పోలీసులకు అత్యాధునిక శిక్షణ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. సీనియర్ అధికారుల నుండి కానిస్టేబుల్ వరకు ప్రతీ ఒక్కరికీ శిక్షణ ఇచ్చామని ఆయన చెప్పారు. నవంబర్ 12న పదవీ విరమణ చేయనున్న అనురాగ్ శర్మ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. తన 35 సంవత్సరాల పోలీసు సర్వీసు చాలా సంతృప్తికరంగా సాగిందని ఆయన చెప్పారు. పోలీస్ శాఖలో ఏన్నో మార్పులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాల నియామకాల్లో సమూల మార్పులు తీసుకుని వచ్చామని ఇది తనకు ఎంతో తృప్తినిచ్చిందని అనురాగ్ శర్మ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా సహకారం అందిచారని ఆయన తోడ్పాటు మరువలేనిదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖను ఆధునీకరించేందుకు ముఖ్యమంత్రి ఎంతో చొరవ తీసుకున్నారని అన్నారు. తాను 1992లో దక్షిణ మండలం డీసీపీగా బాధ్యతలు తీసుకున్న సమయంలో పాతబస్తీ లో పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్నాయని ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవని అన్నారు.