దేవేందర్ గౌడ్ బంధువుల సంస్థలపై ఐటి దాడులు

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ బంధులకు సంబంధించినదిగా అనుమానిస్తున్న సంస్థలపై విశాఖపట్నంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. స్థానిక దువ్వాడ సెజ్ లోని పలు గోదాముల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలు భారీ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయంటూ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. వీటిలో టీజీఐ సంస్థ కూడా ఉంది. ఇది దేవేందర్ గౌడ్ బంధువలదిగా సమాచారం. లాజిస్టిక్ రంగంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచిన టీజీఐలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు అడిగితెలుసుకుంటున్నారు.
విశాఖపట్నంలోని ఎఁవీపీ కాలనీలో ఉన్న ఆదాయపుపన్ను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుండి పెద్ద సంఖ్యలో ఆ శాఖ అధికారులు బయలుదేరి దాడులు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించి అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. పలువురు తెలుగుదేశం నాయకులకు సంబంధించిన సంస్థలపై దాడులు జరుగుతుండడం రాజకీయ దుమారాన్ని రేపుతుండగా మరోసారి తెలంగాణకు చెందిన సీనియర్ టీడీపీ నేత బంధువలదిగా చెప్తున్న సంస్థలపై దాడులు జరగడం విశేషం.