వీరంతా నయీం చేతిలో బలైపోయారా

పోలీసుల కాల్పల్లో హతమైన కరడుగట్టిన నేరగాడు నయీం అరాచకాలు తవ్విన కొద్దీ బయటకు వస్తున్నాయి.నయీం చేసిన హత్యలు ఎన్నీ అన్న విషయం పోలీసుల లెక్కల్లో చిక్కడం లేదు. తనకు అడ్డువచ్చిన వారిని హతమార్చడంతో పాటుగా బెదిరింపులకు లొంగని వారిని కూడా నయీం మట్టుపెట్టాడు. వీటితో పాటుగా నయీం సుపారీ హత్యలు కూడా చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నయీం హతమైన తరువాత నయీం అరాచాలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 27 హత్య కేసులతో సహా 174 కేసులను నమోదు చేశారు. నయీం చేసిన హత్యలు ఇంకా ఎక్కువ ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత లేదన్నా కనీసం మరో పాతిక నుండి ముప్పై మంది దాకా నయీం చేతిలో హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. నయీం అరాచాలకు సంబంధించిన కేసులను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తును వేగంగా పూర్తి చేయడంతో పాటుగా పక్కగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నయీం అరాచాకాలకు సంబంధించి సమాచార సేకరణకు నడుంబింగిచారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో మిస్సింగ్ కేసులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ మిస్సింగ్ కేసులు కూడా నయీం అరాచకాలకు బలైపోయిన వారివిగా భావిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని మిస్సింగ్ కేసులను గుర్తించిన పోలీసులు ఇవి నయీం హత్యగానే పోలీసులు నిర్ణారణకు వచ్చినట్టు సమాచారం.
నయీం అకృత్యాలకు భయపడి చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. నయీం తమ వారిని చంపిన విషయం తెలిసినా కేవలం మిస్సింగ్ కేసు పెట్టి ఊరుకున్న వారు కూడా ఉన్నారు. నయీం పై పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయిన వారు నయీం చనిపోయిన తరువాత కూడా కేసులు పెట్టేందుకు ముందుకు రాకపోవడం పోలీసులను ఆశ్చర్య పరుస్తోంది. నయీం హతమైన తరువాత కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడానికి బాధితులు భయపడుతున్నారు. కొంత మందిని నయీం ముఠా కుటుంబ సభ్యుల ముందే అత్యంత కిరాతకంగా హత్య చేసినా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *