శ్రీలంక పై ప్రతీకారం తీర్చుకున్న భారత్

తొలి వన్డోలో ఎదురైన ఘోర పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మొహాలీలో జరిగిన మ్యాచ్ లో భారత్ శ్రీలంకను చిత్తు చేసింది. మొదటి మ్యాచ్ లో అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైన భారత్ రెండో మ్యాచ్ లోనే తేరుకుంది. శ్రీలంకను చావగొట్టి చెవులు మూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ అద్బుతమైన డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 153 బంతుల్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో అదరగొట్టిన రోహిత్ శర్మ 208 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చాడు. శ్రేయస్ అయ్యర్ 70 బాల్స్ లో 88 రన్స్, శిఖర్ ధావన్ 67 బాల్స్ లో 68 రన్స్ చేయడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది.
భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఎక్కడా లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు. 50 ఓవర్లలో లంక 8 వికెట్లు కోల్పోయి 251 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో భారత్ 141 పరులు భారీ తేడాతో విజయం సాధించింది. 3 వన్డేల సిరిస్ లో భారత్ , శ్రీలంకలు చెరో మ్యాచ్ ను గెల్చుకున్నాయి. ఆఖరి మ్యాచ్ ఆదివారం నాడు విశాఖ పట్నంలో జరగనుంది.