కాంగ్రెస్ పని ఖతమేనా…

దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కానుందా…కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్య తలెత్తిందా… ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే  చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఇక ఆ పార్టీ మునిగిపోతున్న నావలాంటిదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లాంటి అత్యంత కీలకమైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతినింది. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే అవకాశం లేని కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీ పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయిందని సమాజ్ వాదీ పార్టీతో పొత్తుపెట్టుకోవడమే ఆ పార్టీ చేసిన అతిపెద్ద పొరపాటనే వాదనలు వినిపిస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ బదులు బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని ఉంటే కొంతవరకైనా ఫలితం ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. సమాజ్ వాదీతో పొత్తుకు ముందు యూపీకి చెందిన కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారని అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏక పక్షంగా పొత్తు పెట్టుకునేందుకే మొగ్గు చూపిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే రోజులు పోయాయని అంటున్నారు. అధిష్టానం పెద్దల చుట్టూ ఉన్న కోటరీ అన్నీ తామై వ్యవహరిస్తున్నారనేది పార్టీలోని కొందరి వాదన. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆనారోగ్యం కారణంగా ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు. అన్నీ తానై రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల పొత్తుల దగ్గర నుండి పార్టీ టికెట్ల కేటాయింపుల వరకు రాహుల్ గాంధీ అన్నీ తానై వ్యవహరించినా ఉత్తర్ ప్రదేశ్ లో ఆపార్టీ దారుణంగా దెబ్బతినింది. గతంలో ఎన్నడూ లేన్నని తక్కువ సీట్లను గెల్చుకుని రాష్ట్రంలో పార్టీ కనీసం తలఎత్తుకుని నిలబడే పరిస్థితిలేకుండా పోయింది. దేశవ్యాప్తంగా క్రమంగా కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. ముందు స్థానిక పార్టీలు కాంగ్రెస్ అస్థిత్వాన్ని దెబ్బకొట్టగా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి నిలువనీడ లేకుండా చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు, రాజకీయ తప్పటడుగుల కారణంగా పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. మణిపూర్, గోవాలలో అతిపెద్ద పార్టీలుగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన కమీస మద్దతు సంపాదించుకోలేకపోయింది. అధికారానికి కావాల్సిన ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల మద్దతు సాధించలేకపోవడం అటుంచి గవర్నర్ వద్దకు వెళ్లి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామనే సంగతి కూడా చెప్పలేకపోవడం వ్యూహాత్మక తప్పిదనే భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న రాహుల్ గాంధీకి రాజకీయ చతురత లేకపోవడం వల్లే గోవా, మణిపూర్ లు తమ చేయిదాటిపోయాయని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుతున్నారు. గోవాలో మనోహర్ పారికర్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించి కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ సుప్రీంను ఆశ్రయించే ముందు కనీసం గవర్నర్ అపాయింట్ మెంట్ కూడా ఎందుకు కోరలేదో చెప్పాలంటూ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించడంతో కాంగ్రెస్ పెద్దలు తప్పును తెలుసుకుని సరిదిద్దే ప్రయత్నాలు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండు రాష్ట్రాలను చేచేతుగా పోగుట్టుకున్నామని సగటు కాంగ్రెస్ నాయకులు సణుక్కుంటున్నారు. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో కాంగ్రెస్ దారుణంగా వెనకబడిందని దీన్ని బట్టి తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ నాయకత్వ సామార్థ్యంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న రాహుల్ గాంధీ పై జరుగుతున్న ప్రచారం, ఆయన పూర్తిస్థాయి రాజకీయ నేత కాదు కేవలం పార్ట్ టైం రాజకీయ వేత్త అంటూ జరుగుతున్న ప్రచారం కూడా కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారింది. సోనియా గాంధీ ఆరోగ్యం దెబ్బతిన్న తరువాత కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతలను నెత్తిన వేసుకున్న రాహుల్ గాంధీ పార్టీని సమర్థవంతంగా నడిపించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో ప్రధాని మోడీని ఢీ కొట్టగలిగే సామర్థ్యం ఉన్న నేతలెవరూ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం బూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. రాహుల్ గాంధీ మోడీ పై చేస్తున్న విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. రాహుల్ వి కేవలం పార్ట్ టైం రాజకీయాలనే భావన అటు ప్రజల్లోనూ బలంగానే కనిపిస్తోంది. కేవలం ఎన్నికల సమయంలోనే రాహుల్ బయట ప్రంపచానికి కనిపిస్తున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండాల్సిన నేత ప్రజలకు దూరంగానే ఉండిపోతున్నాడు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. పార్టీని సంస్థాగత స్థాయి నుండి పటిష్ట పర్చే శక్తి రాహుల్ కు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ జపం తప్ప మరో నేతను తెరపైకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేయడం లేదు. స్థానికంగా కాంగ్రెస్ నేతలు బలంగా ఉంటే ఆ పార్టీ తప్పకుండా ఎన్నికల్లో సత్తా చూపుతుందనేది పంజాబ్, మణిపూర్ ఫలితాల ద్వారా స్పష్టం అయింది. అయినప్పటికీ స్థానిక నేతలను ప్రోత్సహించే అలవాటు కానీ వారికి ప్రజల్లో ఉన్న బలాన్ని ఓర్చుకునే పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీలో కనిపించదు. పార్టీ అధిష్టాన నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంజాబ్ కాంగ్రెస్ నేత అమరేందర్ సింగ్ పార్టీని వదిలి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారంటే కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ లో కాంగ్రెస్ విజయం  కెప్టెన్ అమరేందర్ సింగ్ విజయంగా చెప్పక తప్పదు.
పార్టీ కార్యకర్తలను దూరం పెట్టడం కోటరీకే పరిమితం అయి నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తున్నాయి. దేశవ్యాప్తంగా విస్తృతంగా కార్యకర్తలు, నాయకుల బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఢీలా పడిపోవడానికి కొంతమంది పార్టీ ముఖ్యులే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో రాటుతేలకుండానే పార్టీలో పెద్ద పదవులను పొందిన రాహుల్ గాంధీ పార్టీని ఎంతవరకు ముందుకు నడిపించగలరనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీని పూర్తిగా ప్రక్షాలన చేయాలని బాధ్యతలు అందరికీ పంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
మరో వైపు కాంగ్రెస్ పార్టీకి ఓటములు కొత్తకాదని ఓటమి చెందిన ప్రతీకారి ఫినిక్స్ పక్షిలాగా పడిలేవడం కాంగ్రెస్ పార్టీకి మామూలేనని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పై అనసరంగా విమర్శలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోందని ఐదు రాష్ట్రాలకు గానూ మూడు రాష్ట్రాల్లో తమ పార్టీకే అత్యధిక స్థానాలు వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం పై ఏటువంటి అనుమానాలు లేవని అయితే బీజేపీ రాహుల్ పై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవడంలో మాత్రం తాము విఫలం అయ్యామని కాంగ్రెస్ నేతలు కూడా ఆందీకరిస్తున్నారు. ఉత్తర్ ప్రదేస్ లో బీజేపీ గణనీయమైన సీట్లను సాధించినప్పటికీ 2014 లోక్ సభ ఎన్నికల నాటికన్నా ఓట్ల శాతం భారీగా తగ్గిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఒక్క మణిపూర్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ భారీగా ఓట్ల శాతాన్ని చేజార్చుకుందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పంజాబ్ లో అధిరా బీజేపీ మూడో స్థానంలో నిల్చిన సంగతిని పక్కన పెట్టి కేవలం ఉత్తర ప్రదేశ్, ఉత్తరా ఖండ్ ఎన్నికల ఫలితాలను మాత్రమే పెద్దవి చేసి చూపిస్తున్నారని వారంటున్నారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయడం ఎవరితరంకాదనేది కాంగ్రెస్ నేతల వాదన.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *