ఓట్ల తొలగింపులో టీఆర్ఎస్ కుట్ర-జీహెచ్ఎంసీ ముందు కాంగ్రెస్ ధర్నా

రానున్న ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమపద్దతుల్లో ఎన్నికల్లో గెల్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయుకులు ఆరోపించారు. ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను జాబితా నుండి తొలగించారని వారు అంటున్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతు కావడం వెనక టీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయుకులు గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పేందుకు సిద్ధమయ్యారని దీన్ని గ్రహించిన టీఆర్ఎస్ పెద్దలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారనే అనుమానం ఉన్న వారి పేర్లను జాబితా నుండి తొలించారని అంటున్నారు.
ఓటర్ల జాబితా నుండి ఒక లక్ష్మా 70వేల మంది పేర్లను తొలగించడం వెనుక భారీ కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పన్నుతున్న కుయుక్తులకు అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో భారీగా ఓట్లను తొలగిస్తున్నారంటూ వారు ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రాజావ్యతిరేక విధానాలతో ముందుకు పోతోందని అన్నారు. రాష్ట్రాంలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా తయారయిందని అన్నారు.
ఓటర్ల తొలగింపు వ్యవహారంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాలను ఎంపికచేసుకుని ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తాలేకనే టీఆర్ఎస్ పార్టీ దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తోందని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ కుయుక్తులను ప్రజల ముందు ఎండగడతామని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు లక్ష్మారెడ్డి, వీఎస్ఎన్ శ్రీనివాస్, తులసీ శ్రీనివాస్ , బిజ్నేపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *