కాంగ్రెస్ ఛలో అసెంబ్లీ-భారీ భద్రత

రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. సమావేశాల మొదటి రోజునే అసెంబ్లీ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని కాంగ్రెస్ అంటోంది. అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టి తీరతామని అంటోంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులతో అసెంబ్లీని ముట్టడిస్తామని అంటోంది. కాంగ్రెస్ ఛలో అసెంబ్లీ సందర్భంగా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ వైపు దారితీసే అన్ని మార్గాలను మూసేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అటు జిల్లాల నుండి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. తమ కార్యకర్తలను, రైతులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. రైతులను ఆదుకోవడం చేతకాని ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడుతోంది. ప్రభుత్వం దమనకాండకు దిగుతోందని నిరసన కార్యక్రమాలను పోలీసుల సహాయంతో అణచివేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఎద్దేవా చేస్తోంది. అసెంబ్లీలో రైతుల సమస్యల గురించి మాట్లాడేందుకు జంకుతున్న కాంగ్రెస్ సభ బయట అలజడి రేపే ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరకాలు ఆదుకుంటోందని వారికి సమస్యలను తీరుస్తోందని గతంలో ఎన్నడూ లేనంత భరోసాతో తెలంగాణలో రైతన్నలు ఉన్నారని టీఆర్ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ కు కంటగింపుగా మారాయని దీన్ని జీర్ణించుకోలేకనే అనవసర రాద్దాంతం చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *