దోమల సమస్యకు చెక్ పెట్టేందుకు పి అండ్ టి కాలనీ సంక్షేమ సంఘం నడుంబిగించింది. కాలనీలో దోమల సమస్య విపరీతంగా ఉండడంతో కాలనీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సరూర్ నగర్ చెరువు సమీపంలోని కాలనీ కావడంతో దోమల బెడద మరింత ఎక్కువగా ఉంది. రోడ్ల నిల్చోవడానికి సైతం ప్రజలు జంకే పరిస్థితి ఏర్పడింది. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫాగింగ్ చేయాలంటూ ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో కాలనీ సంక్షేమ సంఘమే నడుంబిగించి సమస్యను పరిష్కరించుకుంది. సొంత నిధులతో ఫాగింగ్ యంత్రాన్ని కాలనీ సంక్షేమ సంఘం సమకూర్చుకుంది.
జీహెచ్ఎంసీ వద్ద తదినన్ని ఫాగింగ్ యంత్రాలు లేకపోవడం. ఉన్న వాటిలో కొన్ని పనిచేయకపోవడం వంటి సమస్యల వల్ల సరిగా తమ కాలనీలో ఫాగింగ్ జరక్క దోమలు చాలా ఇబ్బందులు పెడుతున్నాయని దీనితో సంక్షేమ సంఘం నిధులతో స్వంతగా ఫాగింగ్ యంత్రాన్ని కొనుక్కొని కాలనీలో ఫాగింగ్ జరపాలని నిర్ణయించినట్టు సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. దోమ పాటు వల్ల ఇటీవల కాలంలో కాలనీలోని కొంత మంది డెంగీ బారిన పడ్డారని ప్రతీదానికి ప్రభుత్వం పై ఆధారపడకుండా సొంత నిధులతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు పేర్కొన్నారు. పి అండ్ టి కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు పీచర వేంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బి.నాగరావు, ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డిలతో పాటుగా సభ్యులు లంకా లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.