హైదరాబాద్ లో చెడ్డీ, బనియాన్ గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మహారాష్ట్రకు చెందిన ఈ ముఠా దొంగతనాలు చేయడంలో ఆరితేరింది. నిక్కర్, బనియన్ తో దొంగతనాలు చేసే వీరిని చెడ్డీబనియాన్ గ్యాంగ్ గా పిలుస్తారు. మహారాష్ట్రాకు చెందిన ఈ కరుడుగట్టిన నేరగాళ్లు తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తర్ ప్రదేశ్ లలోనూ దొంగతనాలకు పాల్పడుతుంటారు.
5 నుండి 10 మంది సభ్యులతో కూడిన చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి వెళ్ళే సమయంలో తమ వెంట ఆయుధాలను తెచ్చుకుంటారు. కత్తులు, గొడ్డళ్లతో పాటుగా ఒక్కోసారి నాటు తుపాకులలను కూడా తమ వెంట తీసుకుని వస్తుంటారు. దొంగతనాలకు తెగబడే సమయంలో అడ్డువచ్చిన వారిని హతమార్చేందుకు సైతం ఈ ముఠా వెనుకాడదు. వీరు దొంగతనాలు చేసే సమయంలో ఇంట్లోని వారు ఎవరైనా మెల్కొని బయటికి వస్తే విచక్షణా రహితంగా వారిపై దాడికి దిగుతారు.
ఉదయం పూట భిక్షగాళ్ల మాదిరిగానూ, అడ్డా కూలీలుగానూ జనావాస ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి దొంగతనం చేయాల్సిన ఇంటిని ఎంచుకుంటారు. ఎక్కువగా తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేస్తుంటారు. ఎంతటి తాళాన్నైనా చిటికెల పగలగొట్టడంలో వీళ్ళు సిద్దహస్తులు. దొంగతనం చేసిన ఇంటిలో ఒక్కోసారి భోజనం చేయడం వీరికి అలవాటు.
పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడంలో వీళ్లకు నేర్పు ఎక్కువ. దొంగ తనం చేసే సమయంలో ఒంటికి నూనె పూసుకుని వస్తారు. పట్టుకోవడానికి ప్రయత్నించినవారిపై దాడులు చేయడం, నూనే రాసుకోవడం వల్ల చిక్కకుండా తప్పించుకోవడం వీరికి అలవాటు. పెద్ద పెద్ద గోడలను కూడా అవలీలగా దూకేస్తారు. పట్టుబడి జైలుకి వెళ్లినా బయటకి వచ్చి తిరిగి దొంగతనాలకే దిగుతుంటారు. జైల్లో ఉన్న వారి కుటుంబ బాధ్యతను ఇతర సభ్యులు తీసుకుంటారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ముఠా సభ్యుల పేర్లు మాత్రం చెప్పరు.