హైదరాబాద్ శివార్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆపిఉన్న డీజిల్ ట్యాంకర్, గ్యాస్ సిలెండర్ల లారీలకు మంటలు అంటుకున్నాయి. డీజీల్, గ్యాస్ సిలెండర్ల వాహనాలు కావడంతో క్షణాల్లోనే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సిలెండర్లు పేలడంతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారికి కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం జరింది. ప్రమాదంలో బైక్ వెళుతున్న వ్యక్తి ఒకరు సజీవదహనం అయ్యాడు. మరికొందరికి గాయాలు అయినట్టు తెలుస్తోంది.
లారీలు నిల్చిఉన్న సమయంలో సమీపంలోని వెల్డింగ్ షాప్ నుండి ఎగిసిపడ్డ నిప్పురవ్వల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికంగా ఉండే పెట్రోలియం కంపెనీ నుండి బయటికి వచ్చే లారీల నుండి కొంత మంది అక్రమంగా డీజిల్, పెట్రోల్ ను తీసుకుని అమ్ముకోవడం చాలా కాలంగా జరుగుతోందని స్థానికులు చెప్తున్నారు. దొంగచాటుగా లారీల్లోనుండి పెట్రోలియం ను తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే వెల్డింగ్ షాప్ లోని నిప్పురవ్వలు ఎగిసిపడి ఇంత ప్రమాదం జరిగిందని చెప్తున్నారు.