ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కదలికలపై మావోలు రెక్కి నిర్వహించినట్టు వచ్చిన సమాచారం కలకలం రేపుతోంది. మొదటి నుండి మావోల హిట్ లిస్ట్ లో ఉన్న చంద్రబాబు కదలికలను మావోలు జాగ్రత్తగా గమనిస్తున్నరంటూ వార్తలు గుప్పుమన్నాయి. చంద్రబాబు పై గతంలో అలిపిరి వద్ద మావోలు మందుపాతర పేల్చారు. ఈ దాడి నుండి చంద్రబాబు తృటిలో తప్పించుకున్నారు. తాజాగా చంద్రబాబు కదలికలను ఎప్పటికప్పుడు మావోలు గమనిస్తున్నారని అదను కోసం కాచుకుని కూర్చున్నారంటూ వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియా ముసుగులో మావోల కదలికలను గుర్తించినట్టు ఢిల్లీ పోలుసులు తెలిపారు. ఆంధ్ర భవన్ లో భద్రతా లోపాలు ఉన్నాయని గతంలో కూడా ఆంద్రాభవన్ అధికారులకు భద్రతా లోపాలపై సమాచారం ఇచ్చినా వారు దాన్ని పట్టించుకోలేదని ఢిల్లీ పోలీసులు మండిపడుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు మీడియా ముసుగులో మావోల కదలికలు ఉన్నాయన్న విషయాన్ని ఢిల్లీ పోలీసులు స్ఫష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కదలికలకు సంబంధించి మావోల రెక్కిపై తమకు ఎటువంటి సమాచారం లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ చెప్పారు. ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ తరువాత జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర హోంశాక చేసిన సూచనల మేరకు సీఎం భద్రతను కట్టుదిట్టం చేశామని డీజీపి చెప్పారు. మావోలకు సంబంధించిన సమాచారం ఏదీ తన వద్ద లేదన్నారు. ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. సీఎం భద్రత విషయంలో ఎటువంటి రాజీలేదని అవసరం అయితే మరితం భద్రతను పెంచుతాని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడికి బ్లాక్ క్యాట్ కమెండోల రక్షణ కల్పిస్తున్నారు.