హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణ పోరాట సమయంలో విమోచన దినోత్సవాన్ని జరుపుతామంటూ ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడానికి గల కారణాలను తెలంగాణ ప్రజలకు వివరించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కొంత మంది ఒత్తిడులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విమోచన దినోత్సవాన్ని జరపాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ తో రాష్ట్రంలో జరిపిన పర్యటన విజయవంతం అయిందని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ప్రతీ చోట తమ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని లేకుంటే పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ తో ఈ నెల 11,12,13 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.