భూమా ఎన్నిక చెల్లకుండా పోయే ప్రమాదం…?

నంద్యాల ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెల్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిని ఇప్పుడు మరో భయం వెంటాడుతోంది. ఆయన ఎన్నిక చెల్లకుండా పోయే ప్రమాదం ఉందంటూ వస్తున్న వార్తలు టీడీపీ వర్గాలతో పాటుగా భూమా కుటుంబీకులను కలవర పెడుతున్నాయి. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల భూమా ఎన్నిక చెల్లకుండా పోయే ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల ప్రచారం ఖర్చు పరిమితిని మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే భూమా ఎన్నిక చెల్లుబాటు కాదు. నంద్యాల ఉప ఎన్నికలకు గాను ఎన్నికల సంఘం 28 లక్షల రూపాయల పరిమితిని విధించింది. దీనితో పాటుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తే ప్రముఖుల జాబితాను కూడా ఎన్నికల సంఘానికి ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిన ప్రముఖుల జాబితాను సకాలంలో ఇవ్వకపోవడంతో చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ లాంటి ప్రముఖులు బ్రహ్మానంద రెడ్డి కోసం నిర్వహించిన ప్రచారం ఖర్చులను ఆయన ఖర్చుల్లో కలపాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వల్ల భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నకల ఖర్చు పరిమితిని మించిపోయే అవకాశాలు లేకపోలేదు.
ఉప ఎన్నిక నోటిపికేషన్ తరువాత పార్టీ తరపున ప్రచారం చేసే ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన జాబితాను ఎన్నికల సంఘానికి వారం లోగా ఇవ్వాలనే నిబంధనను టీడీపీ పాటించలేదు. రెండు వారాల తరువాత గానీ చంద్రబాబు నాయుడు, బాలకృష్ణల పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి ఇవ్వలేదు. దీనితో వీరి ప్రచారానికి అయిన ఖర్చును కూడా పార్టీ అభ్యర్థి భూమా బ్రాహ్మనంద రెడ్డి ఖాతాలో వేయాలనే ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు భూమా బ్రహ్మానంద రెడ్డికి ప్రమాదకరంగా మారింది. దీని వల్ల ఇప్పటికే భూమా బ్రహ్మానంద రెడ్డి చూపిన లెక్కలకు అదనంగా చంద్రబాబు, బాలకృష్ణల పర్యటన ఖర్చులను కూడా కలుపుతారు. దీని వల్ల ఎన్నికల సంఘం విధించిన పరిమితి దాటిపోయే ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి.
అయితే ఇటువంటి అనసర భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉన్నందు వల్ల ప్రస్తుతానికి భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికకు సంబంధించి ఆందోళన అవసరం లేదని కొందరు న్యాయనిపుణులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *