దత్తన్నను ఎందుకు పక్కన పెట్టారు…?

తెలంగాణ బీజేపీలో సీనియర్ నేత కేంద్ర మంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయను మంత్రి పదవినుండి ఎందుకు తప్పించారనే అంశంపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అధిష్టానం అదేశాల ప్రకారం ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేస్తున్న దత్తాత్రేయను తప్పించడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఇప్పడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. తెలంగాణలో మొదటి నుండి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బండారు దత్తాత్రేయ ను పక్కకు తప్పించడానికి బలమైన కారణమే ఉండి ఉంచ్చనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలతో మంచి సంబంధాలున్న నాయకుడిగా వివాద రహితుడిగా పేరున్న దత్తాత్రేయను పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటారనే ప్రచారం సాగుతున్న మంత్రి పదవి నుండి తప్పించడానికి అది కారణం కాదనే తెలుస్తోంది. దత్తన్నగా కార్యకర్తలు ముద్దుగా పిల్చుకునే ఈయనకు గవర్నర్ పదివి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ పదవి ఇస్తే ప్రత్యక్ష రాజకీయాల నుండి వైదొలిగినట్టే. ఆయనకు గవర్నర్ పదవికి ఇస్తే సికింద్రబాద్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం ప్రస్తుత పరస్థితుల్లో బీజేపీ ఉప ఎన్నికకు వెళ్తుందా అనేది అనుమానమే. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంచి సంబంధాలే ఉన్నప్పటికీ రాజకీయంగా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే స్థితిలో టీఆర్ఎస్ లేదు. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ స్థానం నుండి పోటీ చేస్తుంది. బలమైన టీఆర్ఎస్ ను ఎదుర్కొని తిరిగి సికింద్రాబాద్ లోక్ సభ స్థానాన్ని దక్కించుకోవడం బీజేపీకి తలకు మించిన భారమే. ఒక వేళ సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి బీజేపీ ఓడిపోతే దాని ప్రబావం ఖచ్చితంగా బీజేపీ పై పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కోరికోరి తలనొప్పులు తెచ్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు.
తెలంగాణ నుండి మురళీధర రావుకు అవకాశం కల్పించడం కోసం దత్తన్నను పక్కనపెట్టారనే వార్తలు కూడా వస్తున్నాయి. మంచి వ్యూహకర్తగా పేరు పొందిన మురళీధర రావుకు ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోయినా పార్టీ అధిష్టానంలో మంచి పట్టుంది. అమిత్ షా వర్గానికి చెందిన నేతగా ఉన్న మురళీధర రావు కోసం దత్తన్నను పక్కకు తప్పించారనే ప్రచారం సాగుతోంది. అయితే బండారు దత్తాత్రేయ కార్మిక మంత్రిగా ఆశించిన మేరకు పనిచేయడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన పనితీరు పట్ల ప్రధాని మోడి అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మొదటి నుండి మృదు స్వభావిగా పేరుగాంచిన దత్తాత్రేయ నుండి ఇంతకంటే మెరుగైన ఫలితాలు అశించడం అత్యాశే అనే విషయం పార్టీ పెద్దలకు తెలియంది కాదు.
తెలంగాణలో టీఆర్ఎస్ తో కేంద్ర ప్రభుత్వం ఒక వైపు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే మరో వైపు పార్టీ పరంగా అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గట్టి వ్యూహాలే పన్నుతున్నారు. బీజేపీకి అవకాశాలు ఉన్న తెలంగాణలో పార్టీని మరింత దూకుడుగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుండి పార్టీకి ఏకైక ఎంపీగా,కేంద్ర మంత్రిగా ఉన్న దత్తాత్రేయ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా ఉండడంతో కూడా పార్టీపెద్దలతు తలనొప్పిగా మారినట్టు సమాచారం. పెద్ద మనిషి తరహాలో ఉండే బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రితో ఎటువంటి వివాదాలు లేకుండా ఉంటున్నారు. అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా పార్టీ సరిగా ప్రజల్లోకి తీసుకుని పోలేకపోతోందనే ప్రచారం ఉంది. దత్తాత్తేయను తప్పించడం వెనకు ఇది కూడా ఒక బలమైన కారణంగా కనిపిస్తోంది.
ఈ పరిణామాలపై దత్తాత్రేయ మాత్రం తన శైలిలో స్పందిస్తున్నారు. పార్టీలో తన లాంటి కార్యకర్తలు వందల సంఖ్యలో ఉన్నారని పార్టీ ఎవరని ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటే అట్లా ఉపోయగించుకుంటుందని చెప్తున్నారు. ఇక నుండి పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొంటానని దత్తన్న చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *