చంద్రబాబు నాయుడు కు నాన్ బెయిలబుల్ వారెంట్

మాహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ప్రయత్నించిన కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాయి.ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆయనతో పాటుగా ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో 14 మందికి కూడా వారెంట్ జారీ అయింది. గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని అంటూ నాడు విపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. నాటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి మహారాష్ట్రాలోకి ప్రవేశంచిన చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిన పోలీసులు అటు తరువాత వదిలిపెట్టారు.
చంద్రబాబు నాయుడితో పాటుగా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్ట నేతలు, ఎమ్మెల్యేలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు వద్దకు అనుమతి లేకుండా వెళ్ళడానికి ప్రయత్నించారంటూ మహారాష్ట్ర పోలీసులు నాన్ బేయిలబుల్ కేసులు పెట్టారు. 2010 నుండి ఆ కేసు పెండింగ్ లోనే ఉండిపోయింది. ధర్మాబాద్ కోర్టులో ఈ కేసు నడుస్తోంది. తాజాగా మహారాష్ట్రాకు చెందిన ఒక వ్యక్తి ఈ కేసుకు సంబంధించి మరోసారి కోర్టును ఆశ్రయించడంతో చంద్రబాబు నాయుడితో పాటుగా మరో 14 మందికి ధర్మాభాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ లను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది. 8 సంవత్సరాలుగా ఈకేసులో చంద్రబాబుకు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు ఒక్కసారిగా బెయిల్ కు కూడా అవకాశం లేకుండా వారెంట్ లను జారీ చేయడం వెనుక బీజేపీ హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం తరపున ఎటువంటి కదలికా లేకుండా మిన్నకుండిపోయిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పాత కేసులను తిరగదోడడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రగానే భావించాల్సి వస్తుందని టీడీపీ నేతలంటున్నారు.
కేసులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా దాడులు చేయించడం ద్వారా చంద్రబాబును లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.

రాజాసింగ్ ను అడ్డుకునేందుకు భారీ కసరత్తు