ధర్మశాల టెస్టు,సిరీస్ ముగిసిన తరువాత ఆస్ట్రేలియా కెప్టెన్ స్వీవ్ స్మిత్ భారత ఆటగాళ్ళకు బీర్ పార్టీ చేసుకుందాం అంటూ ఆఫర్ ఇచ్చాడట. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు దూరంగా ఉండడంతో ఈ మ్యాచ్ కు కెప్టన్ గా వ్యవహరించిన రహానే కు స్మిత్ ఈ ఆఫర్ ఇచ్చాడట. అయితే స్మిత్ ఆఫర్ ను రహానే సున్నితంగా తిరస్కరించి త్వరలోనే కలుద్దాం అంటూ వచ్చేశాడట. రహానే, స్మిత్ ఇద్దరూ పూణే తరపున ఐపీఎల్ మ్యాచ్ లలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన వెంటనే స్మిత్ రహానేతో కొద్దిసేపు ముచ్చటించాడు. మైదానంలో కొన్ని సందర్భాల్లో తాను వ్యవహరించిన తీరు పట్ల సారీ చెప్పిన స్మిత్ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోయానని అన్నాడు. భారత్ ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించినందుకు బాధపడుతున్నట్టు చెప్పాడు.
సిరీస్ ముగిసిన వెంటనే ప్రత్యర్థి జట్టుతో కలిసి బీర్ పార్టీ చేసుకోవడం ఆసిస్ క్రీడాకారులకు ఆనవాయితీ అయితే ఈ సిరీస్ లో ఆసిస్ ఆటగాళ్లు శృతిమించి వ్యవహరించారని భారత్ జట్టు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ లో భావోద్వేగాలు సహజమే అయినా ఆసిస్ జట్టు మరీ ఓవర్ చేసిందనేది మన ఆటగాళ్ల భావన. కెప్టెన్ విరాట్ కూడా ఆస్ట్రేలియా టీం వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉడడంతో రహానే స్మిత్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది.