భరతమాత మొడలోని కౌస్థుబం-ఈ భారత రత్నం

అటల్ బిహారీ వాజపేయి విలువలకు కట్టుబడ్డ నేత…పదవుల కోసం విలువలతో రాజీపడడం ఆయనకు తెలీదు. ఆయన ఒక మహోన్నత నేత, కవి,  అటల్‌జీ ప్రసంగం మరో గంగా ప్రవాహం…గుండె గుండెలో మహానుభూతులు తరంగ భంగిమలను పొంగులెత్తించిన మధుర విన్యాసం. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని సింధే కీ ఛావనీ గ్రామంలో చిరు సరితగా జాలువారిన వాజ్‌పేయి జీవితం మహా సింధువు వలె భారతావని నలు చెరగులను ముంచెత్తింది. ఆయన జీవన ప్రస్థానం సమకాలీన భారత చరిత్రకు ప్రతిబింబం… శక్తివంతమైన ఆయన వ్యక్తిత్వం జనసంఘ్ రాజకీయ పక్షానికి కల్లోల కడలిలో చుక్కాని అయింది. భారతీయ జనతాపార్టీ ప్రగతి ప్రస్థాన కరదీపిక అయింది. ఉజ్వల కాంతుల విజయ కేతనమైంది.‘భూమి మరుగుజ్జులను కోరుకోదు.. అది ఎత్తైన మహా పురుషులను కోరుకుంటుంది.. ఆకాశాన్ని తాకే వారిని కోరుకుంటుంది.. కొత్త గ్రహాల వైభవాన్ని కనిపెట్టే ఉన్నతులను కోరుకుంటుంది…’ అని వాజపేయి అన్నారు. ‘

పార్లమెంట్‌లో ఆయన కూర్చుంటే మొత్తం సభ అంతా కవితామయం అయినట్లు అనిపించేది. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన లేచి నిలబడితే చాలు సభ అంతా నిశ్శబ్దంగా మారేది. అలలు అలలుగా ఆయన చేసే ప్రసంగానికి ముగ్ధులు కాని వారెవ్వరు? 1957లో వాజపేయి తొలి ప్రసంగానికే నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టిని ఆకర్షించారు. విదేశాంగ విధానంపై వాజపేయి ప్రసంగించిన వెంటనే నెహ్రూ లేచి నిలబడి వాజపేయిపై ప్రశంసల వర్షం కురిపించారు. నాడు నెహ్రూను ఆకర్షించిన వాజపేయిని సభలో ఢీకొనగల శక్తి ఎవ రికీ ఉండేది కాదు. మేధావిగా గుర్తింపు పొందిన పి.వి. కూడా వాజపేయికి అమితమైన గౌరవాన్నిచ్చేవారు. ఇరువురూ రాజకీయాల్లో ప్రత్యర్థు లైనప్పటికీ బయట మంచి స్నేహితులు. వాజపేయి కవితల సంకల నాన్ని పి.వి. ఆవిష్కరిస్తే పి.వి. ఇన్‌సైడర్‌ నవలను వాజ పేయి ఆవిష్కరించారు. ఆయ న ఏనాడూ పార్లమెంట్‌ను విస్మరించేవారు కాదు. ఎవరైనా ఘాటుగా విమర్శిస్తే వాజ పేయి తన చమత్కార సంభా షణలతో వారిని నోరు మూయించేవారు. ఆయన సీరియస్‌గా మాట్లాడితే సభ అంతా నిశ్శబ్దంగా చెవులు రిక్కించి ఆయన మాట్లాడే ప్రతి అక్షరాన్ని వినేది. ఉన్నట్లుండి ఆయన కవితామయమైన వాక్యాలతో సభలో అందర్నీ ఆకట్టుకునేవారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన వాజపేయి రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సంఘ్‌ను సమర్థించినా సభలో ఎలాంటి అలజడి రేగేది కాదు. ఆయన వాగ్ధోరణి, వాదనా పటిమ అలాంటిది.

ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ దేశంకంటె గొప్పవాడు కాజాలడు…ఒక రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కంటె శక్తివంతమైనది కాజాలదు. ఇలా సూత్రీకరించిన వాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. 1977లో మురార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో అటల్ బిహారీ విదేశ వ్యవహారాల మంత్రి…పదవీ స్వీకార ప్రమాణం చేసిన రోజున సాయంత్రం కొత్త ఢిల్లీలో జరిగిన సార్వజనికోత్సవ సభలో వాజ్‌పేయి ఈ సూత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సూత్రాన్ని ఆయన ప్రచారం చేయలేదు. పాటించి ప్రస్ఫుటింప చేశారు. అందుకే ఆయన కేవల రాజకీయవేత్త కాలేదు. రాజకీయ పరిధిని అతిక్రమించి రాజ్యాంగ విస్తృత భూమికను పండించిన ప్రజాస్వామ్య కృషీవలుడయ్యారు.


అటల్ బిహారీ వాజ్ పేయి కన్నుమూత