తమిళనాడు అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి… అసెంబ్లీలో కుర్చీలు, మైకులు విరిగాయి… పేపర్లు చింపి గాల్లో వేశారు… విరిగిన కుర్చీల ముక్కలు స్పీకర్ పై విసిరేశారు… మార్షల్స్ రక్షణలో స్పీకర్ అసెంబ్లీ నుండి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.. స్పీకర్ బయటకు రాగానే ఏకంగా సెల్వం అనే డీఎంకే ఎమ్మెల్యే స్పీకర్ స్థానంలో కూర్చున్నారు… పళని స్వామి బలనిరూపణకు సమైవేశమైన తమిళనాడు అసెంబ్లీలో కిష్కిందకాండ జరిగింది. స్పీకర్ పై విపక్షాలకు చెందిన సభ్యులు దాదాపు దాడిచేసినంత పనిచేశారు. అతి కష్టంమీద స్పీకర్ సభ నుండి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సభను వాయిదా వేసి తిరిగి ప్రారంభమయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. అరుపులు కేకల స్థాయిని దాటి అసెంబ్లీలో బాహాబాహీకి దిగారు. విశ్వాస తీర్మానం పై ఓటింగ్ సందర్భంగా రహస్య ఓటింగ్ కు పట్టుబట్టిన పన్నీరు సెల్వం వర్గంతో పాటుగా డీఎంకే, కాంగ్రెస్, ముస్లీం లీగ్ లు అధికార పక్షనికి వ్యతిరేకంగా సభలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు శృతిమించాయి. సభలో ఘర్షణ వాతావరణాన్ని ఆపడం భారీగా మోహరించిన మార్షల్స్ వల్ల కూడా కాలేదు. ఎమ్మెల్యేల చేష్టలతో మార్షల్స్ చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తోపులాటల్లో పలువురు మార్షల్స్ కు గాయలు కాగా ఒకరు సృహతప్పి పడిపోయారు.