తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పీజు రీయంబర్స్ మెంటు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సమాధానానికి సంతృప్తి చెందని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి వెంటనే విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. సభ వాయిదా పడిన తరువాత కూడా సభ నుండి బయటకి రాకుండా సభ లోపలే ఆందోళన చేపట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రభుత్వం తగిన సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు దుయ్యబట్టారు. ఫీజులపై తమ ప్రశ్నలకు కేసీఆర్ సర్కారు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళన విరమింపజేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మరో వైపు అసెంబ్లీ బయట పార్టీల అనుబంధ విద్యార్థి, యువజన సంఘాలు నిరసనకు దిగడంతో పోలీసులు భారీగా బందోబస్తున ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి వారివారి పార్టీ కార్యాలయాలకు తరలించారు. కాంగ్రెస్ సభ్యులను గాంధీ భవన్ కు , టీడీపీ సభ్యులను ఎన్టీఆర్ భవన్ కు, సీపీఎం సభ్యుడిని బసవపున్నయ్య భవన్ కు తరలించారు. పోలీసులు విపక్ష ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తున్న సందర్భంలో తీవ్ర ఉధ్రిక్తత చోటుచేసుకుంది.