వేధింపులకు గురవుతున్న అర్చకుడు

దశాబ్దాలుగా ఒక దేవాలయాన్ని అంటిపెట్టుకుని జీవిస్తున్న అర్చకుడిని దేవాలయ కమిటి వేధింపులకు గురిచేస్తోందని బ్రాహ్మణ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. దేవలయ బాధ్యతల నుండి తప్పుకోవాలంటూ అర్చకుడిని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఇది దారుణమని సంఘం నాయకుడు మల్లాది చంద్రమౌళి పేర్కొన్నారు. దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్న వారిని చులకనగా చూడడంతో పాటుగా వారికి సరైన వేతనాలు కూడా ఇవ్వడం లేదని దీనికి తోడు అఖస్మాత్తుగా వారిని పదవులను నుండి తప్పుకోమంటూ వేధింపులకు కూడా గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అర్చకుడు అనేపదానికి కనీస గౌరవం కరువయిందని వారంటున్నారు.
తాజాగా మౌలాలీలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా ఆయన వివరించారు. స్థానిక గాయత్రినగర్ లోని హనుంతుని దేవాలయంలో గత 34 సంవత్సరాలుగా మోహనా చారి అర్చకత్వబాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. 8 సంవత్సరాలుగా దేవలయ కమిటీ ఆతనిని వేధింపుకు గురిచేస్తోందని తాజాగా దేవాలయ అర్చకత్వ బాధ్యతల నుండి తప్పుకోవాలంటూ మోహనాచారిని బెదిరింపులకు గురిచేయడంతో పాటుగా అతనిచేత బలవంతంగా రాజీనామా చేస్తున్నట్టు లేఖను తీసుకున్నట్టు చంద్రమౌళి వివరించారు.
సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించాల్సిందిగా కమిటీ సభ్యులు ఒత్తిడితీసుకుని వస్తున్నా దానికి లొంగకపోవడంతో అతనిపై వేధింపులకు గురిచేస్తున్నారని మల్లాది చెప్పారు. దశాబ్దాలుగా అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని అఖస్మాత్తుగా పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కమిటీలో ఉన్న వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం పేద బ్రాహ్మణుడిని బలిపశువును చేస్తున్నారని ఆయన అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఆధికారంలో ఉన్న ఆలయ కమిటీ అర్చకుడిపై లేనిపోని ఆరోపణలు మోపుతున్నారని అన్నారు.
అర్చకులను వేధిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక వార్డ్ మెంబర్ మల్లాది దుర్గ, పలువురు కాలనీ వాసులు అర్చకుడికి అండగా నిలబడ్డారని దీనిపై ఎంతవరకైనా పోరాటం చేయనున్నట్టు ఆయన తెలిపారు.