ఏపీలో అధికారం ఎవరిది?- ప్రత్యేక కథనం

0
116

అంధ్రప్రదేశ్ లో అధికారాన్ని నెలబెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ సర్వ శక్తులను ఒడ్డుతుండగా మరో వైపు గతం చేజారిన అవకాశాన్ని ఈ దఫా దక్కించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. ఈ ఎన్నికల్లో గెలుపు రెండు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో పాటుగా పార్టీల భవితవ్యానికి ఈ ఎన్నికల్లో గెలవడం రెండు పార్టీలకు అత్యంత అవసరంగా మారింది. అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకున్నా ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వడం ద్వారా తన పార్టీ ఉనికిని చాటుకునేందుకు జనసేన ప్రయత్నిస్తుంటే ఈ దఫ కనీసం తమ పార్టీ ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని పోయేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోంది.
2014 ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఎన్నికలు మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదకగానే జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏపీ తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. రెండు శాతం ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. కొద్ది తేడాతో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పటి నుండి ప్రజా క్షేత్రంలో తెలుగుదేశం పార్టీతో సమరం సాగిస్తూనే ఉంది. ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం లో చేరిపోవడంతో వైసీపీ ఒక దశలో రాష్ట్రంలో పట్టుకోల్పోయే పరిస్థితులు ఏర్పడినప్పటికీ జగన్ పాదయాత్ర ద్వారా తిరిగి రాష్ట్రంలో పుంజుకుంది.
గత ఎన్నికలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. నాడు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీతో జట్టుకుట్టి ఎన్నికల్లో పోటీచేసింది. ఇటు జనసేన అధినేత పవన కళ్యాణ్ కూడా టీడీపీకి మద్దతు పకడం కూడా ఆ పార్టీకి లాభించింది. పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల వైసీపీ దెబ్బతినిందని లేకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదనే అభిప్రాయం అటు వైసీపీ శ్రేణులతో పాటుగా ఇటు రాజకీయ విశ్లేషకుల్లోనూ ఉంది. గత ఎన్నికల్లో అధికారానికి కొద్ది దూరంలో నిల్చిపోయిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ఈ దఫా అధికారంలోకి వస్తుందా అంటే ఖచ్చితంగా ఎవరూ చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీకి తెలుగుదేశం దూరం అయినా జనసేన విడిగా పోటీచేస్తున్నప్పటికీ ఏపీకి అధికారం ఎవరిని వరిస్తుందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితులే నెలకొన్నాయి. వివిధ సర్వేల పేరుతో వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కొన్ని సంస్థల పేరుతో బయటికి వస్తున్న సర్వే ఫలితాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉండడం మరింత గందరగోళపరుస్తోంది.
ఒక విశ్వసనీయ సంస్థ నిర్వహించన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నట్టు సమాచారం. అధికార తెలుగుదేశానికి, అధికారం కోసం పారాడుతున్న వైసీపీకి మధ్య తేడా కేవలం ఒక్క శాతం మాత్రమేనని తెలుస్తోంది. జనసేన రాష్ట్రంలో ఓట్లను చీల్చగలుగుతుంది తప్ప ఆ పార్టీ పెద్ద సంఖ్యలో సీట్లను సాధించే పరిస్థితులు కనిపిండంలేదని సర్వేలో వెల్లడయింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలు ఆ పార్టీకి లాభిస్తున్నాయి. ముఖ్యంగా పసుప-కుంకుమ, నిరుద్యోగ బృతి, పెన్షన్లు ప్రజల్లోకి వెళ్లాయి. ఇటు జగన్ పాదయాత్ర , ప్రభుత్వ వ్యతిరేకత వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కు లాభిస్తున్నాయి. అయితే జనసేన చీల్చే ఓట్లే ఇప్పుడు ఏపీలో అత్యంత కీలకంగా మారుతున్నాయి. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా కనిపించడం లేదు.

Wanna Share it with loved ones?